కోటి ఆశల ‘కోట్‌పల్లి’ | - | Sakshi
Sakshi News home page

కోటి ఆశల ‘కోట్‌పల్లి’

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

రూ.86.30 కోట్లు మంజూరు అలుగు, కుడి, ఎడమ,బేబీ కెనాల్‌ పునరుద్ధరణ పనులు చివరి ఆయకట్టు వరకు నీరందించేలా చర్యలు 23 గ్రామాల రైతులకు ప్రయోజనం

ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు కావడంతో అలుగు, కుడి, ఎడమ, బేబి కెనాల్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులో పూడిక పేరుకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. కాలువలు దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. సంవత్సరాల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో ఆయకట్టు ఆరుతడి పంటలకే పరిమితమైంది. ప్రాజెక్టు కింద మొత్తం 9,200 ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 4,500 ఎకరాలకే సాగునీరు అందే పరిస్థితికి చేరింది. అనేక మార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది. రైతుల ఆందోళనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో ఇటీవల ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.86.30 కోట్లు మంజూరు చేసింది. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా 50శాతం మేర పూర్తయ్యాయి.

ఆయకట్టు ఇలా..

ప్రాజెక్టు కుడి కాలువ 24కిలో మీటర్లు ఉండగా 7,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువ 11 కిలోమీటర్లు.. 1,640 ఎకరాల ఆయకట్టు, బేబి కెనాల్‌ 1.6 కిలోమీటర్లు.. 360 ఎకరాల ఆయకట్టు ఉంది. అలుగు, కాలువలు దెబ్బతినడంతో సగం ఆయకట్టుకే సాగునీరు అందుతోంది. చివరి ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలతో సరిపెట్టుకుంటున్నారు.

జిల్లాకే తలమానికం

కోట్‌పల్లి ప్రాజెక్టును 1967 సెప్టెంబర్‌ మాసంలో 1,784 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. ఈ ప్రాజెక్టు సాగునీటి వనరే కాకుండా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ధారూరు మండలంలోని ఐదు గ్రామాలకు, పెద్దేముల్‌ మండలంలోని 18 గ్రామాలకు సాగునీరు అందిస్తోంది.

నాణ్యతకు తిలోదకాలు

కాలువల నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. ఇసుక స్థానంలో డస్ట్‌ వాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా త్వరగా కాలువలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలువలను గ్రానైట్‌ రాళ్లతో నిర్మించారు. ప్రస్తుతం వాటిని తొలగించి నిర్మాణాలు చేస్తున్నారు. తొలగించిన రాళ్లను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని విక్రయిస్తే ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదా యం వస్తుందని రైతులు అంటున్నారు.

శరవేగంగా ప్రాజెక్టు ఆధునీకరణ పనులు

నాణ్యత పాటించాలి

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్ర త్యేక చొరవతో ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.86.30 కోట్లు మంజూరయ్యాయి. పనులు నాణ్యతగా ఉండాలి. ఇరిగేషన్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సీసీ పనుల్లో వాటర్‌ క్యూరింగ్‌ సరిగ్గా చేయాలి.

– వరద మల్లికార్జున్‌, రైతు, నాగసమందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement