అనంతగిరి: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. కేటీఆర్ రేపటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ వికారాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో గురువారం వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. రామయ్యగూడ పాఠశాలలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్సిళ్లు, పలకలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అన్నదానం చేశారు. అనంతరం కేక్ కట్‌చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎన్నికల ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సూది ఉంటే దూది ఉండదన్నారు. రామయ్యగూడ పాఠశాల భవనం కూలిపోయేందుకు సిద్ధం ఉందన్నారు. స్కూల్‌లోకి పాములు వస్తున్నాయని, విద్యార్థులను భయాందోళన చెందుతున్నారని తెలిపారు. పాత భవనాన్ని తొలగించి కొత్తది నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


