అనంతగిరి: విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జి, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీట్ పరీక్ష ఎంతో కఠినమైనదని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు భరించి పిల్లలను చదివిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో పేపర్ లీక్ అయ్యిందన్నారు. కోట్లాది మంది విద్యార్థులు భవిష్యత్తును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. విద్యార్థులకు క్షమాపణలు చెప్పడంతో పాటుగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, నాయకులు చింటూ రెడ్డి, నిఖిల్ రెడ్డి, శివానందం, పలువురు నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


