యాచారం: ఫార్మాసిటీ భూ బాధిత రైతులు రోజుకో రకంగా సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు సర్కార్ పెద్దలు రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఫార్మాసిటీ భూ బాధిత రైతులకు అండగా ఉంటా మని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక.. వారిని పట్టించుకోకపోవడంపై అన్నదాతలు కాంగ్రెస్ పెద్దలపై గుర్రుగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండేళ్లుగా రోజుకో మాదిరిగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారు. వీరికి ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఫార్మాసిటీ భూబాధిత రైతులను తమ వైపు తిప్పుకొని, వారికి ఎలా న్యాయం చేద్దామనే అలోచనలో పడింది. సీఎంఓ కార్యాలయ సూచన మేరకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండెడ్డి రంగంలోకి దిగారు.
2,200 ఎకరాలతోనే అసలు పంచాయితీ
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని పది గ్రామాల్లో 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించడానికి నిర్ణయించిన విషయం విదితమే. యాచారం మండలం నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో దాదాపు 10 వేల ఎకరాల అసైన్డ్, పట్టా భూములు సేకరించడానికి నిర్ణయించి 7,800 ఎకరాలకు పైగా పరిహారం అందజేశారు. నక్కర్తమేడిపల్లిలో 483.25 ఎకరాలు, నానక్‌నగర్‌లో 154.16 ఎకరాలు, తాడిపర్తిలో 382.35 ఎకరాలు, కుర్మిద్దలో 974.06 ఎకరాలతో పాటు కోర్టు కేసుల్లో ఉన్న మరో 300 ఎకరాల పట్టా భూముల రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అప్పటి ప్రభుత్వం దాదాపు 900 మందికి పైగా రైతులకు చెందిన 2,200 ఎకరాల పట్టా భూమికి రాత్రికిరాత్రే అవార్డులు పాస్ చేసి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసి భూ రికార్డులను టీజీఐఐసీ పేరిట మార్చేసింది. అనుమతి లేని భూరికార్డుల మార్పును వ్యతిరేకిస్తూ రైతులు నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంకల్పించిన విషయం విదితమే. దీంతో రైతుల నుంచి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి నిర్ణయించింది. సీఎంఓ కార్యాలయ ఆదేశాల మేరకు ఇటీవల తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి నాలుగు గ్రామాల కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. వివాదంలో ఉన్న 2,200 ఎకరాల పట్టా భూమి సమస్యను ఎలా పరిష్కరించాలి.. ఎలా న్యాయం చేద్దామని చర్చించారు. అమరావతిలో మాదిరిగా ల్యాండ్ పూలింగ్ చేసి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున ప్లాటు.. లేదంటే మెరుగైన పరిహారం అందజేయాలనే విషయమై సమాలోచనలు చేశారు. ఆసక్తి కలిగిన రైతులకు ల్యాండ్ పూలింగ్ చేసి ఎకరాకు 1,500 గజాల ప్లాటు, లేదంటే రూ.కోటి– కోటిన్నరకు పైగా పరిహారం అందజేసి, 121 గజాల ప్లాటు ఇస్తే రైతులను ఒప్పిస్తామని నాలుగు గ్రామాల నేతలు తెలిపారు. గ్రామాల్లో రైతుల అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని మల్‌రెడ్డి, కోదండరెడ్డి వారికి వివరించారు.
లేదంటే పరిహారం పెంపు?
అథారిటీలో ఉన్న 2,200 ఎకరాల పట్టా భూముల సమస్య పరిష్కారంపై సర్కార్ ఫోకస్
ఇటీవల పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముదిరెడ్డి, మల్‌రెడ్డి
ముఖ్యమంత్రితో సమావేశమై న్యాయం చేస్తామని హామీ


