కొడంగల్ రూరల్: వర్షాలు సమృద్దిగా కురవాలని, పంటలు బాగా పండాలని ముస్లిం మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని మక్కా మసీదులో ఎస్‌ఎం.గౌసన్ ఆధ్వర్యంలో ఇమామ్ అబ్దుల్ కరీం అశ్రఫీ, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా వానలు కురవకపోవడంతో మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు.
బొంరాస్‌పేట: మండలంలోని బాపన్‌చెర్వు తండాకు చెందిన రాథోడ్ మహేశ్(16)ఈ నెల 2 నుంచి కనిపించకుండా పోయాడు. బాలుడు రేగడిమైలారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు. తండ్రి శంకర్ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దోమ: అన్యాక్రాంతమైన సంజీవస్వామి ఆలయ భూములను తిరిగి ఆలయ పేరిట మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని దొంగ ఎన్కేపల్లి మాజీ సర్పంచ్ అశోక్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కుల్కచర్ల మండలం అల్లాపూర్ సర్వే నంబర్ 67లో 2.25 ఎకరాలు భూమి ఉండేదని పీఏసీఎస్ చైర్మన్ సిద్దాంతి పార్థసారథి పేరుపై ఎలా మారిందని చెప్పాలన్నారు. దీంతో పాటు దోమ మండలం బ్రాహ్మణపల్లి సర్వే నంబర్ 103లో 1.31 గుంటల 1992లో ఓ గిరిజనుడి అమ్మినట్లు బాండ్ రాసి ఇచ్చారన్నారు. వీటిపై విచారణ జరపాలని ఆయన కోరారు.
పూడూరు: ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయింది. ఈ ఘటన మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగళ్ల తిర్మలయ్యకు చెందిన ఇంటి నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు సర్పంచ్ జానకీ, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లోని సామగ్రి కాలిపోయింది. అల్మారాలో ఉన్న రూ.2 లక్షలు నగదు, 30 తులాల వెండి, టీవీ, ఫ్రిడ్జి ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధుతులు కోరారు.
చేవెళ్ల: చేవెళ్ల సబ్‌రిజిస్టార్ ఎ.శ్రీనివాస్‌కు డీఆర్‌ఓగా పదోన్నతి లభించింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలోని సీనియర్ ఎస్‌ఆర్‌ఓలకు కల్పించిన పదోన్నతుల్లో చేవెళ్ల సబ్‌రిజిస్టార్ శ్రీనివాస్ ఉన్నారు. ఖమ్మం జిల్లా డీఆర్‌ఓగా పదోన్నతి రావడంతో ఆయన చేవెళ్ల నుంచి నుంచి బదిలీ అయ్యారు. కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
షాద్‌నగర్‌రూరల్: పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణ శివారులోని కేశంపేట బైపాస్ రోడ్డులో యమ్మి హోటల్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి తన కారులో పెట్రోలు పోయించుకునేందుకు వచ్చాడు. పెట్రోల్ సిబ్బంది కారు నుంచి గన్ తీయక ముందే కారు ముందుకు కదిలింది. దీంతో పెట్రోల్ గన్ కింద పడి రాపిడికి గురై మంటలొచ్చాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి నష్టం జరగలేదు.


