● ఇటీవల బీఆర్‌ఎస్ సభలో భారీగా చేతివాటం
● నేతల జేబులు కత్తించి నగదు, మెడలో బంగారు ఆభరణాలు తస్కరణ
● నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
● పరారీలో మరో ముగ్గురు
● వివరాలు వెల్లడించిన మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి
మహేశ్వరం: మండల కేంద్రంలో ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ సభలో నాయకుల జేబులు కత్తిరించి నగదు, బంగారు గొలుసులు దొంగిలించిన దొంగలు చిక్కారు. వారి నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని పోతర్ల సంగయ్య యాదవ్ కన్వెన్షన్ హాలులో గత నెల 27న జరిగిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సభకు వచ్చిన నేతల జేబులు కత్తిరించి నగదు, మెడల నుంచి బంగారు గొలుసులు, చేతికి పెట్టుకున్న బ్రాస్‌లెట్‌లు తస్కరించారు. బాధితులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో హైదరాబాద్ సిటీ అఫ్జల్‌సాగర్, మంగర్ బస్తీ, మల్లేపల్లి, హబీబ్‌నగర్ బస్తీలకు చెందిన కాంబ్లే కై లాష్, అథ్కాడే రవి, కాంబ్లే శ్యామ్‌సుందర్, కాంబ్లే అరుణ్ అలియాస్ చాకు, ఎండీ అసాద్ చోరీలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.17.45 లక్షల విలువైన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.55 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు కాంబ్లే ప్రీతమ్, రిజ్వాన్, మోడల్ శ్రీను పరారీలో ఉన్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో ఐదు నుంచి పదికి పైగా చోరీ కేసులు నమోదై ఉన్నాయి. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్‌ఐలు ప్రసాద్, రాఘవేందర్‌రావు, ధనుంజయ్, క్రైం సిబ్బంది శివరాజ్, ప్రవీణ్‌కుమార్, అజయ్‌ను డీసీసీ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో ఏసీపీ జానకిరెడ్డి, సీఐ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.


