బతుకుతామనుకోలే.. | - | Sakshi
Sakshi News home page

బతుకుతామనుకోలే..

Nov 5 2025 9:14 AM | Updated on Nov 5 2025 9:14 AM

బతుకు

బతుకుతామనుకోలే..

బతుకుతామనుకోలే..

కంకరలో ఇరుక్కున్నాం నరకం అనుభవించాం

ఎలాగోలా బయటపడ్డాం భయానక ప్రయాణం

ఆస్పత్రిపాలవుతామనుకోలేదు క్షతగాత్రుల మనోగతం

చేవెళ్ల: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ప్రస్తుతం 13 మంది చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై వారిని కదిలించగా ఉబికివచ్చే కన్నీళ్లతో తమ అనుభవాలను పంచుకున్నారు. మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చినట్లుగా ఉందని, షాక్‌ నుంచి తేరుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు.

తలచుకుంటేనే భయంగా ఉంది

బస్సు తాండూరులోనే నిండిపోయింది. ధారూరు, వికారాబాద్‌ వచ్చేసరికి సీట్లు లేక చాలామంది నిల్చున్నారు. ప్రమాదంలో నడుం వరకు కంకరలో కూరుకుపోయాను. నా కాలుకు రేకు దిగింది. రెండు ఫీట్లు ముందుండి ఉంటే ప్రాణాలు పోయేవి. బతికిపోయాను అనుకున్నా. తలచుకుంటేనే భయంగా ఉంది.

– బస్వరాజ్‌, కోకట్‌

ప్రాణాలు పోతాయనుకున్నా..

నగరంలో స్వీపర్‌గా పనిచేస్తాను. ధారూరు నుంచి రోజూ తాండూరు నుంచి వచ్చే మొదటి బస్సుకే వెళ్తుంటాను. సోమవారం కూడా ఎప్పటిలాగే బస్సు ఎక్కగా సీట్లు లేకపోవడంతో డ్రైవర్‌ పక్కనే ఉన్న బ్యానెట్‌పై కూర్చున్నా. మీర్జాగూడ గేట్‌ రాగానే మలుపులో ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్‌ను చూసి లారీ వస్తుంది తమ్మి అని డ్రైవర్‌కు చెప్పా. డ్రైవర్‌ బస్సును పక్కకు మలిపేలోపు టిప్పర్‌ ఢీకొట్టింది. కంకరలో మొత్తం మునిగిపోయా. నా చేయి మాత్రమే పైకి ఉండిపోయింది. తోటి ప్రయాణికులు నా చేయి పట్టుకొని బయటకు తీశారు. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనుకున్నా. తీవ్ర గాయాలతో బతికిబయటపడ్డా.

– నాగమణి, ధారూరు

రైలు మిస్‌ కావడంతో..

హైదరాబాద్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాను. వీక్లీ ఆఫ్‌ కావడంతో ఇంటికి వచ్చాను. ఎప్పుడు వచ్చినా రైలుకు వెళ్తాను. సోమవారం ఉదయం 4.30కు రైలు మిస్‌ కావడంతో 4.40 గంటలకు తాండూరు నుంచి వెళ్లే మొదటి బస్సు ఎక్కాను. బస్సు డ్రైవర్‌ కంట్రోల్‌ చేశాడు. కానీ టిప్పర్‌ డ్రైవర్‌ వచ్చి ఢీకొట్టాడు. నిలబడి ఉన్న నేను కంకరలో ఇరుక్కుపోయాను. నా ముందు ఒకతని ప్రాణాలు పోయాయి. జేసీబీ వచ్చే వరకు బయటకు రాలేకపోయా. ఇలా ఆస్పత్రి పాలవుతాననుకోలేదు.

– బి.శ్రీనివాస్‌, తాండూరు

కంకరలో కూరుకుపోయా..

మన్నెగూడ నుంచి చేవెళ్లలో ఆస్పత్రికి చూపించుకునేందుకని బస్సు ఎక్కాను. బస్సు పూర్తిగా నిండిపోవడంతో నిలబడి పోయాను. ప్రమాదంతో కంకరలో సగం వరకు కూరుకుపోయా. డోర్‌కు దగ్గరలో ఉండడంతో స్థానికులు రెండు చేతులు పట్టి బయటకు లాగారు. లేదంటే ప్రాణాలు పోయేవి. రోడ్డు బాగాలేకే ఈ ప్రమాదం జరిగింది. అసలే అనారోగ్యంతో ఉన్నాను. ఈ ప్రమాదంతో మరింతగా బాధపడుతున్నాను.

– అనుసూయ, బొంగుపల్లి

ఏం జరిగిందో అర్థం కాలేదు

వికారాబాద్‌లో ఉంటూ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిస్తున్నాను. వారానికి ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్తాను. ఆదివారం వచ్చి సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్నాను. బస్సులో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. తరువాత చూస్తే అంతా దుమ్ము, కంకర. అందులో పడిన వారి అరుపులు వినిపించాయి. నాకు ముక్కుకు, తలకు కంకర తగిలి గాయలయ్యాయి.

– ఆర్‌.అఖిల్‌, పూడూరు

బతుకుతామనుకోలే.. 1
1/5

బతుకుతామనుకోలే..

బతుకుతామనుకోలే.. 2
2/5

బతుకుతామనుకోలే..

బతుకుతామనుకోలే.. 3
3/5

బతుకుతామనుకోలే..

బతుకుతామనుకోలే.. 4
4/5

బతుకుతామనుకోలే..

బతుకుతామనుకోలే.. 5
5/5

బతుకుతామనుకోలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement