ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి?
తాండూరు టౌన్: తాండూరు – హైదరాబాద్ రోడ్డును నాలుగు లేన్లగా విస్తరించాలంటూ తాండూరు డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డెక్కారు. మంగళవారం స్థానిక విలియంమూన్ చౌక్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భీష్మించుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా తాండూరు – హైదరాబాద్ రోడ్డు నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రజలు ఎన్నిమార్లు మొత్తుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడగామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరగా కొందరు అడ్డుకన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రోజుల్లో రోడ్డు పనులపై ప్రణాళిక విడుదల చేయాలని లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ తారాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో తాండూరు డెవలప్‌మెంట్ ఫోరం కన్వీనర్లు గోపాలకృష్ణ, కమాల్ అతర్, బాసిత్ అలీ, సోమశేఖర్, రాజ్‌కుమార్, విజయలక్ష్మి పండిట్, హాదీ, రాజుగౌడ్, సుదర్శన్ గౌడ్, షుకూర్, రాంబ్రహ్మం, శ్రీనివాస్, శోభారాణి, అనురాధ, నయీమ్, రామకృష్ణ, జావీద్, ఇంతేయాజ్, తాండూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు – హైదరాబాద్ రోడ్డును విస్తరించాల్సిందే ..
లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం
తాండూరు డెవలప్‌మెంట్ ఫోరం
రాజకీయాలకు అతీతంగా ధర్నా


