స్నేహితుల వద్దకు వెళ్తూ మృత్యువాత
మోమిన్‌పేట: ఇద్దరు మిత్రులు కలిసి హైదారాబాద్‌లో ఉంటున్న తమ స్నేహితుల వద్దకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకని నరేష్(21), మంగలి మనోజ్‌కుమార్(19) హైదరాబాద్‌లో ఉన్న తమ మిత్రులను కలిసేందుకు సోమవారం రాత్రి బైక్‌పై బయల్దేరారు. 11 గంటల సమయంలో మోమిన్ పేట సమీపంలోని మొరంగపల్లి కార్తికేయ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు 108కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న సిబ్బంది అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ అరవింద్ వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనోజ్‌కుమార్ తుఫాన్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నరేశ్ వ్యవసాయంలో తండ్రికి సాయపడేవాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బైక్‌ను ఢీకొట్టిన
గుర్తు తెలియని వాహనం
అక్కడికక్కడే ఇద్దరు యువకుల దుర్మరణం
రొంపల్లిలో విషాదఛాయలు
స్నేహితుల వద్దకు వెళ్తూ మృత్యువాత


