వీడిన ఉత్కంఠ
వివరాలు వెల్లడించిన కలెక్టర్ ప్రతీక్‌జైన్ తాండూరు మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు.. వికారాబాద్ – ఎస్పీ మహిళ పరిగి – బీసీ మహిళ కొడంగల్ – జనరల్ మెజార్టీ వార్డుల్లో నేతల అంచనాలు తారుమారు పోటీకి సిద్ధమవుతున్న నాయకులు
ఖరారైన మున్సిపల్ చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు
వికారాబాద్/తాండూరు/కొడంగల్/పరిగి: ఎప్పు డెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. శనివారం కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతల సమక్షంలో కలెక్టర్ ప్రతీక్ జైన్.. అడిషనల్ కలెక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించారు. చైర్మన్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపాలిటీలు ఉండగా.. వీటి పరిధిలో 100 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల తరహాలోనే రిజర్వేషన్లు వస్తాయని నేతలు భావించారు. అయితే వారి అంచనాలు తారుమారయ్యాయి. గతంలో వికారాబాద్ మున్సిపాలిటీ ఎస్సీ, జనరల్, జనరల్ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ సారి ఎస్టీ లేదా బీసీలకు కేటాయిస్తారని ఊహించారు. కానీ ఎస్పీ మహిళకు కేటాయించారు. పరిగి, తాండూరు పురపాలికలు జనరల్‌కు కేటాయిస్తారని భావించారు. కానీ తాండూరు బీసీ జనరల్‌కు, పరిగి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఎంతో ఆశ పెట్టుకున్న నేతలు నిరాశకు గురవుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఎవరుంటే బాగుంటుందనే ఆలోచనలో పడ్డారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ పదివిని బీసీ జనరల్‌కు, వికారాబాద్ ఎస్పీ మహిళ, పరిగి బీసీ మహిళ, కొడంగల్ జనరల్‌కు కేటాయించారు. ఏడాది కాలంగా ఊరిస్తూ వచ్చిన పుర పోరుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయా పార్టీలు సైతం బలమైన అభ్యర్థుల వేటలో పడ్డాయి.


