
మీసేవలో అధిక వసూళ్లు
ధారూరు: నిర్ణీత రుసుము కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న మీసేవ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. మండల కేంద్రంలోని మీసేవకు దోర్నాల్ గ్రామానికి చెందిన మహిపాల్ నిర్ణీత రుసుముకు మించి డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దార్ సాజిదాబేగం ఆర్‌ఐ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ భీంకుమార్‌ను మీసేవకు పంపించారు. పదవ తరగతి పరీక్షల సమయంలో మీసేవ సెంటర్ తెరిచి ఉండడం, జిరాక్స్ సెంటర్ కొనసాగించడంపై ఆర్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయంలోని ఈడీఎంతో మాట్లాడారు. స్పందించిన ఈడీఎం రేపటి వరకు మీసేవ షట్టర్ తాళాలు ఇవ్వొద్దని సూచించారు. రాజీవ్ యువ వికాస్ పథకం కోసం ఆదాయ, కుల ధ్రువీకరణ దరఖాస్తులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆధార్ అప్‌డేట్‌కు సైతం ఎక్కువ మొత్తంలో తీసుకున్నారని ఫిర్యాదు చేసిన వెంటనే తిరిగి ఇచ్చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నట్లు రుజువైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు తహసీల్దార్‌ను ప్రశ్నించగా.. మీసేవపై ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని వివరించారు.
తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
రేపటి వరకు మీసేవ బంద్

మీసేవలో అధిక వసూళ్లు