
పాండురంగ.. సేవలు వరంగా
కుల్కచర్ల: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా గడపడంతో పాటు ఇతర వ్యాపకాల వైపు దృష్టిసారిస్తారు. వారికి ఇష్టమైన వ్యాపారం, వ్యవసాయం, మొక్కల పెంపకం.. ఇలా తమ అభిరుచులకు తగిన పనులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసి, రిటైరైన ప్రధానోపాధ్యాయుడు పాండురంగయ్య విద్యార్థుల శ్రేయస్సు కోసం పాఠాలు కొనసాగిస్తున్నారు. ఈయన సేవలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వరంగా మారాయి.
ప్రతిరోజూ బడికి..
హెచ్‌ఎం పాండురంగయ్య గత నెల 24న ఉద్యోగ విరమణ పొందారు. కానీ ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో మంచి ఫలితాలు రావాలనే లక్ష్యంతో నిత్యం బడికి వస్తున్నారు. ఎప్పటిలాగే సమయానికి స్కూల్‌కు చేరుకుని పిల్లలకు గణితం బోధిస్తున్నారు. అంతేకాకుండా దోమ, షాద్‌నగర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మ్యాథ్స్‌పై ప్రత్యేక తరగతులు చెప్పడంతో పాటు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను వివరిస్తూ మోటివేషనల్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శమే
షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన పాండురంగయ్య 13జూన్ 2024లో ఇప్పాయిపల్లి ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్‌ఎంగా విధుల్లో చేరారు. అనతికాలంలోనే విద్యార్థుల నడవడికలో మార్పులు తీసుకురావడంతో పాటు వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తూ మౌలిక వసతుల కల్పన కోసం తన సొంత డబ్బులు వెచ్చించారు. తాను పనిచేస్తున్న పాఠశాలలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తమవంతు సాయం అందించేందుకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాసవి క్లబ్‌కు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇప్పాయిపల్లి స్కూల్ విద్యార్థులకు వైట్ అండ్ వైట్ దుస్తులు, టై, బెల్టు, షూస్ అందజేయడంతో పాటు వాటర్ ప్యూరిఫయర్ వంటి సౌకర్యాలను కల్పించారు.
పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేస్తున్న గురువు
ఉద్యోగ విరమణ పొందినా నిత్యం విధులకు హాజరు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు
సొంత డబ్బులతో వసతుల కల్పన
ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ గెజిటెడ్ హెచ్‌ఎం పాండురంగయ్య
ఉన్నతిలోకి రావాలి
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు నావంతు కృషి చేస్తున్నా. ఉద్యోగ విరమణ అనేది నా ఉద్యోగ జీవితంలో ఒక భాగమే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అవసర నిమిత్తం నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా. పేద పిల్లలు ఉన్నతిలోకి రావాలనేదే నా సంకల్పం.
– పాండురంగయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం