Sakshi News home page

సంక్షేమంలో మేమే నంబర్‌ వన్‌ అంటూ.. 'ఎవరి ధీమా వారిదే'!

Published Sat, Aug 12 2023 6:24 AM

- - Sakshi

వికారాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై విజయ కేతనం ఎగురవేసేందుకు అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈసారి విజయం మాదంటే.. మాదేనని ధీమా వ్యక్తంచేస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమంలో మేమే నంబర్‌ వన్‌గా ఉన్నామని.. ప్రజలు తమవైపే మొగ్గుచూపుతారని అధికార బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుండగా.. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా గెలుపు మాదేనని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ దారుణంగా విఫలమైందని, ఈ విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో హస్తం పార్టీ వెనకబడిందని చెబుతున్న బీజేపీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న తమకు విజయావకాశాలు దండిగా ఉన్నాయని బీఎస్పీ నేతలు ప్రకటిస్తున్నారు.

పథకాలే గెలిపిస్తాయి..
సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తాండూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని తొంభైశాతానికి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులే గెలుస్తారని బలంగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచినప్పటికీ తాండూరు అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లో చేరానని.. అనుకున్నట్లుగానే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు తీయించానని ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి చెబుతున్నారు.

ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ తనకే వస్తుందని, మరోసారి గెలిచి తాండూరును రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలబెడుతానని పేర్కొంటున్నారు. ఇందుకోసం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.

బలమైన ఓటు బ్యాంక్‌..
గత ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్‌ అభ్యర్థే గెలుపొందారని, ఈసారి కూడా విజయం తమవైపే ఉంటుందని ఆ పార్టీ సీనియర్‌ నేత రమేష్‌ మహరాజ్‌ పేర్కొంటున్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన రోహిత్‌రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని, మహేందర్‌రెడ్డిని తాండూరు ప్రజలు గత ఎన్నికల్లోనే తిరస్కరించారని చెబుతున్నారు.

నియోజకవర్గ ప్రజలెవరూ వారిద్దరినీ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ ఇక్కడ మరోసారి కాంగ్రెస్‌ విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరినా.. ఆయనతో వెళ్లింది కొద్ది మంది మాత్రమేనని, అసలు సిసలైన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలందరూ ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారంటున్నారు.

అన్నింటికి మించి తాండూరులో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని, ఎవరెన్ని చెప్పినా వీరు మారే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి వెళ్లిన వారిని సైతం తిరిగి ఆహ్వానిస్తామని, పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని చెబుతున్నారు.

బహుజన నినాదంతో..
బహుజన నినాదంతో బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అభ్యర్థిగా బోయిని చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్గపోరును భరించలేని తాండూరు ఓటర్లు బహుజనుల కోసం పాటుపడే బీఎస్పీ వైపు మొగ్గు చూపుతారని చంద్రశేఖర్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బీసీలకు టికెట్‌ ఇస్తే..?
రాష్ట్రంలో మెజారిటీ జనాభా బీసీలే. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ జిల్లాకు రెండు చొప్పున అసెంబ్లీ స్థానాలను బీసీ అభ్యర్థులకు ఇవ్వాలని బీసీ సంఘాలు ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి బీసీ లేదా జనరల్‌కు కేటాయించినా.. టికెట్‌ తనదేనని రమేశ్‌మహరాజ్‌ చెబుతున్నారు.

అలాగే బీజేపీ నుంచి బీసీ అభ్యర్థులైన రవిశంకర్‌, రమేష్‌ కుమార్‌, మురళీకృష్ణ గౌడ్‌, నరేశ్‌మహరాజ్‌ బరిలోకి దిగేందుకు పావులు కదుపు తున్నారు. ఒకవేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తాండూరు టికెట్‌ను బీసీలకు కేటాయిస్తే తప్పకుండా తనకే టికెట్‌ వస్తుందని బీసీ కమిషన్‌ రాష్ట్ర సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కీలకం కానున్న మైనార్టీ ఓట్లు..
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు మైనార్టీల నుంచి మంచి సపోర్టు ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు బరిలో నిలిచినా మైనార్టీ ఓట్లు చీలడం మాత్రం ఖాయం. బీజేపీకి మైనార్టీలు ఓటువేసే పరిస్థితిలో లేరని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు మైనార్టీ ఓట్లను చీల్చుకుంటే ఇరువురికి ఇబ్బందికరంగానే మారుతుందని..

ఈ క్రమంలో మిగిలిన వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకొనేందుకు తాండూరు బరిలో బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని దింపవచ్చనే టాక్‌ కూడా జోరుగా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి తాండూరులో రసవత్తర పోటీ ఖాయమనే చెప్పవచ్చు. ఏ పార్టీ ఎవరికి బీ– ఫారం ఇస్తుందో స్పష్టంగా తెలిస్తే తప్ప ఒక నిర్దిష్టమైన అవగాహనకు రాలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.

వర్గపోరే ప్రధాన బలహీనత.. 
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. టికెట్‌ తనకే వస్తుందని బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ముప్పై ఏళ్లుగా తాండూరు ప్రజలకు సేవ చేస్తున్నానని.. మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేశానని, అన్నివర్గాల ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నానని చెబుతున్నారు.

ఏది ఏమైనా బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేది, తాండూరులో గెలిచేది నేనేనని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండుగా చీలిపోయిన బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఎంత మంది సర్ది చెబుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.

తాండూరులో రసవత్తర రాజకీయం.. 
తాండూరు నడిబొడ్డున కాషాయం జెండా రెపరెపలాడించాలని బీజేపీ నేతలు కూడా విశ్వప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎన్‌ఆర్‌ఐ పటేల్‌ రవిశంకర్‌కు ఇంటిపోరు తప్పలేదు. సొంత పార్టీ నేతల నుంచి ఈయనకు అంతగా మద్దతు లభించలేదు. ఎప్పటి నుంచో పార్టీని పట్టుకుని ఉన్న తనను కాదని ఎన్‌ఆర్‌ఐకి టికెట్‌ ఇవ్వడంపై అసంతృప్తికి గురైన స్థానిక బీజేపీ నేత రమేష్‌కుమార్‌ అప్పట్లో తన క్యాడర్‌తో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు.

అనంతరం జరిగిన పరిణామాలతో తిరిగి సొంతగూటికి వచ్చారు. గత ఎన్నికల్లో పైలట్‌ రోహిత్‌ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించిన మురళీకృష్ణ గౌడ్‌.. ఆయనతో విడిపోయి బీజేపీలో చేరారు. ప్రస్తుతం గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమయ్యారు. గతంలో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన నరేష్‌ మహరాజ్‌ బీఆర్‌ఎస్‌లో చేరి.. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇటీవల తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, ప్రస్తుత తట్టేపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఉన్న లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకొన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఇటీవల ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ప్రకటించారు. రమేశ్‌కుమార్‌, మురళీకృష్ణగౌడ్‌, నరేష్‌ మహరాజ్‌, లక్ష్మారెడ్డి.. ఇలా అందరూ తమను తాము ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకోవడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

Advertisement
Advertisement