పప్పుధాన్యాలు తగ్గుతున్నాయ్‌! | Pulses Cultivation in the State Faces the Threat of Disappearing | Sakshi
Sakshi News home page

పప్పుధాన్యాలు తగ్గుతున్నాయ్‌!

Mar 23 2026 1:19 AM | Updated on Mar 23 2026 1:19 AM

Pulses Cultivation in the State Faces the Threat of Disappearing

రాష్ట్రంలో పెరుగుతున్న వరి, మొక్కజొన్న,  పత్తి, పంటల సాగు... ప్రత్యామ్నాయ పంటలను పట్టించుకోని రైతులు 

మూడేళ్ల పంటల తీరును వెల్లడించిన సామాజిక, ఆర్థిక సర్వే  

రైతులను ప్రోత్సహించేందుకు బోనస్‌ ఇచ్చే ఆలోచనలో సర్కార్‌ 

మంత్రి తుమ్మలకు పంటల మార్పిడి బాధ్యత అప్పగింత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవసాయ రంగం కొన్నేళ్లుగా స్థిరమైన పురోగతిని నమోదు చేస్తున్నప్పటికీ, పంటల వైవిధ్యంలో వెనుకబడిపోతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ.. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌ మినహా ఇతర పంటల సాగులో వెనుకబడిపోతున్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గత మూడేళ్లలో వివిధ పంటల సాగు తీరుతెన్నులను ఈ సర్వే కళ్లకు కట్టింది. పంటల మార్పిడి విషయంలో రైతులు మేల్కొనకపోతే రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు కనుమరుగయ్యే పరిస్థితి రానుంది. 

2023–24లో 207.95 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 2024–25 కల్లా 232.10 లక్షల టన్నులకు పెరిగింది. 2025–26 నాటికి ఇది 236.87 లక్షల టన్నులకు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగా చెబుతున్నా, రైతుల ఆలోచనలో మార్పు రావడం లేదు. 

ఇతర పంటలకు కోతులు, అడవి పందుల బెడద ఉండటం, దిగుబడిపై ఉన్న అనుమానాలను వ్యవసాయ అధికారులు నివృత్తి చేయకపోవడంతో రైతులు కొంతకాలంగా అలవాటైన పత్తి, వరి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో రైతుల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఇతర పంటలు సాగు చేసే రైతులకు బోనస్‌ ఇవ్వాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్‌లో పంటల బోనస్‌ కోసం రూ. 3,500 కోట్లు కేటాయించింది. 

ఇప్పుడు సన్న వడ్లకు ఇస్తున్న బోనస్‌ను పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలకూ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇదే విషయాన్ని నర్మెటలో ఆదివారం జరిగిన సభలో రేవంత్‌రెడ్డి చెబుతూ, పంటల వైవిధ్యం పెంచడానికి ఏంచేయాలనే అంశంపై నిర్ణయానికి రావాలని మంత్రి తుమ్మలకు సూచించారు.  

పప్పుధాన్యాల్లో తగ్గిన స్థిరత్వం 
రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్థిరత్వం తగ్గింది. హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2023–24లో 3.61 లక్షల టన్నులుగా ఉన్న పప్పు ధాన్యాల ఉత్పత్తి 2024–25లో 3.99 లక్షల టన్నులకు పెరిగినప్పటికీ, 2025–26లో ఇది 3.48 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉందని అంచనా. 

పెసర, కంది, శనగలు, మినుముల ఉత్పత్తి పడిపోతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి లభ్యత పెరగడంతో గతంలో పప్పుధాన్యాలు సాగు చేసిన భూముల్లోనూ వరి, పత్తికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించే విధానాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.  

ఒకేసారి స్థిరత్వం–మార్పు 
రాష్ట్రంలో పంటల ఎంపికలో స్థిరత్వం, మార్పు అనే రెండు ధోరణులను ఒకేసారి చూపిస్తోంది. ముఖ్యంగా వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ఆధిపత్యం కొనసాగుతుండగా, మొక్కజొన్న వంటి పంటలు క్రమంగా విస్తరిస్తున్నాయి. సోయాబీన్, కందిపప్పు వంటి పంటలు తగ్గుదల చూపుతున్నాయి. యాసంగిలో జొన్న కొంత పెరుగుదల చూపుతుండగా, శనగ, వేరుశనగ తగ్గుతూ ఉన్నాయి. మొక్కజొన్న పంట 9.8 శాతం నుంచి 13 శాతం వరకు పెరగడం రైతుల్లో మార్పు సంకేతంగా కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement