జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం
జైలు గోడల మధ్య నుంచే కామిరెడ్డి గెలుపు
చంద్రగిరిలో దొంగ ఓట్లు వేసుకున్నా సత్తాచాటిన వైఎస్సార్‌సీపీ
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి లీడ్
కౌంటింగ్‌లోనూ ఆగని కూటమి కుట్రలు
పరిషత్ ఎన్నికల ఫలితాలను చూసి షాక్ అయిన కూటమి నేతలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ సత్తా ఏంటో ప్రాదేశిక ఎన్నికలు మరోసారి రుజువుచేశాయి. నామినేషన్ల పర్వంతో మొదలైన కూటమి అరాచకపర్వాన్ని దాటుకొని ప్రతిదశలో ఇబ్బందులను తట్టుకొని నిలబడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగురవేశారు. కూటమి నేతలు రిగ్గింగ్, దొంగ ఓట్లు వేసినా ప్రజా ఆశీర్వాదంతో వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాండించారు. ఫ్యాన్ స్పీడ్ చూసి కూటమి నేతలు షాక్‌కు గురయ్యారు. సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే మన పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారు. అనుకున్నట్టే కౌంటింగ్‌లో సైతం కూటమి నేతలు కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం ముంగిటకు చేరిన వెంటనే తమ అస్త్రాన్ని సంధించారు. చాలా చోట్ల రీకౌంటింగ్ పేరుతో అధికారులను అడ్డం పెట్టుకుని కొన్ని ఓట్లు చెల్లకుండా చేశారు. ఆపై గంటల కొద్దీ డిక్లరేషన్ ఫారాలు ఇవ్వనీయకుండా అడ్డుకుంటూ తీరిగ్గా తామే గెలుపొందినట్టు అధికారుల చేత ప్రకటించుకుని మురిసిపోయారు. దీనిపై జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు.
కౌంటింగ్‌కు అంతరాయం
చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో తిరుపతి రూరల్ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ప్రతి రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శిస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి అధికారులపై ఒత్తిడి చేసి కౌంటింగ్‌ని ఆపించారు. మూడో రౌండ్ ముగిసే సరికి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి 900 ఓట్లు ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌంటింగ్ ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేశారు. ఇదే నియోజకవర్గం పేరూరు–2 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆరు ఓట్లతో గెలుపొందారు. టీడీపీ నేతలు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లోనూ అదే ఆరు ఓట్లు ఆధిక్యం ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. ఎర్రావారిపాలెం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి 604 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే డిక్లరేషన్ ఫాం ఇవ్వకుండా అడ్డుకున్నారు. అభ్యర్థి నిరసన వ్యక్తం చేయడంతో చివరకు అందజేశారు. రేణిగుంట వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యత చాటుకుంటూ వచ్చారు. చివరి రౌండ్ ఫలితంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ పుటేజ్ కావాలని కలెక్టర్‌ని కోరారు.
ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే కూటమి కుదేలే
ప్రాదేశిక ఎన్నికలు రాజ్యంగ బద్ధంగా జరిగి ఉంటే కూటమి ఎలా కుదేలయ్యేదో శనివారం వచ్చిన ఫలితాల ద్వారా తేటతెల్లమైంది. ప్రజావ్యతిరేకత ఓట్ల రూపంలో చూపుతారన్న భయంతో టీడీపీ నేతలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలను నామినేషన్ సైతం వేయనీకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎలాగోలా నామినేషన్ వేసి బరిలో నిలిచిన అభ్యర్థులకు పోలింగ్ వరకు అష్టకష్టాలు పడేలా చేశారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్ చేసినా వైఎస్సార్‌సీపీపై ప్రజాభిమానం, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజలు స్పష్టంగా తెలియజేశారు. ఉదాహరణకు పెళ్లకూరు మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనీకుండా 8 చోట్ల టీడీపీ నాయకులు ఏకగ్రీవం చేసుకున్నారు. చివరి రోజు కూటమి నాయకుల దౌర్జన్యాలను తట్టుకొని ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు మాత్రమే పాలచ్చూరు, కలవకూరులో నామినేషన్ వేయగలిగారు. శనివారం వచ్చిన ఫలితాల్లో పోలింగ్ జరిగిన రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ విజపతాకాన్ని ఎగురవేసింది. ఇదే పెళ్లకూరు జెడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలు నుంచి బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలవడం విశేషం. మరోవైపు నారాయణవనం మండలంలోని 11 ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీకి బలమైన ఐదు సెగ్మెంట్లను పచ్చపార్టీ ఏకగ్రీవం చేసుకున్నా.. అధైర్యపడని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ పడిన ఆరు సెగ్మెంట్లలో నాలుగింటిని గెలుచుకుని నైతిక విజయం సాధించారు. రిటర్నింగ్ అధికారి కుయుక్తులతో నారాయణవనం–1, 2, 3, అరణ్యంకండ్రిగ, పాలమంగళం నార్త్ సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను రెజెక్ట్ చేసి టీడీపీకి కానుకగా అందించారు. పోటీపడిన ఆరు స్థానాలలో వైసీపీ అభ్యర్థులు నాలుగు స్థానాలలో ఊహించని రీతిలో గెలుపొందారు. ఆఖరుకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత సెగ్మెంట్ కసిమ్మిట్టలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సౌమ్య 180 ఓట్ల మెజార్టీతో గెలవడం కొసమెరుపు. ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీదే విజయమని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది.
రీకౌంటింగ్ పేరుతో...
సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సుజాత 1,600 ఓట్ల మెజారిటీ సాధించారు. ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసింది. అలా ఐదు పర్యాయాలు రీకౌంటింగ్ జరిపించారు. రీకౌంటింగ్‌లో ప్రతిసారీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే ఆధిక్యం వచ్చింది. అధికారులపై రకరకాల ఒత్తిళ్లు చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మెజారిటీని 735 ఓట్లకు తీసుకొచ్చారు. టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు చేశారు. ఇంకా ఇదే మండలంలో ఆరుగురు వైఎస్సార్‌సీఈప ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించారు. పలుమార్లు రీకౌంటింగ్ చేసినా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే గెలుపొందిన ఎంపీటీసీ అభ్యర్థులకు డిక్లరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
బ్యాలెట్ పేపర్లు విసిరేసిన టీడీపీ ఏజెంట్
స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో తొట్టంబేడు మండలం సింగమాలకు చెందిన టీడీపీ ఏజెంట్ కొన్ని బ్యాలెట్ పేపర్లను తీసి బయటకు విసిరేశారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గమనించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతున్న టేబుల్ వద్ద ఉన్న సునీల్ అకస్మాత్తుగా కొన్ని బ్యాలెట్ పేపర్లను తీసుకుని బయటకు విసిరేశాడు.. బయటకు విసిరిన బ్యాలెట్ పేపర్లను స్వాధీనం చేసుకుని తిరిగి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించారు. ఈ ఘటనపై వైసీపీ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
వెంకటగిరిలో టై
వెంకటగిరి మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో నాలుగు స్థానాలను వైఎస్సార్‌సీపీ, మరో నాలుగు స్థానాల్లో టీడీపీ దక్కించుకున్నాయి. దీంతో వెంకటగిరి ఎంపీపీ స్థానం టై అయ్యింది. అధికారమదంతో ఎలాగైనా ఎంపీపీ స్థానం దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం చేస్తున్నారు.
దాడులు.. దౌర్జనాలు.. ఖీకీల అండదండలు.. అధికారుల సహకారాలు.. అన్నీ దాటుకుని గెలుపు అంచుకు చేరిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయాన్నీ కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు. అధికార మదంతో అడ్డదారులు తొక్కారు. తమకు తొత్తులుగా మారిన కొందరు
అధికారులను ఉసిగొల్పి కౌంటింగ్ ప్రిక్రియలో తమ అస్త్రాన్ని సంధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచినా.. మళ్లీ రీకౌంటింగ్ చేయాలంటూ వారిపై ఒత్తిడి పెంచారు. ఇలా తమకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించినట్టు ప్రకటించుకుని మురిసిపోయారు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న విశ్లేషకులు, విద్యావంతులు కూటమి తీరు చూసి ఛీదరించుకుంటున్నారు.
కేవీబీపురంలో.. విజయం తారుమారు!
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు అధికార టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కేవీబీపురం జెడ్పీటీసీగా గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బత్తల సుజాతకు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫారం అందజేయకపోవడంపై వారు మండిపడ్డారు.
విజయాన్ని రాసిచ్చేశారు!
మొదటి కౌంటింగ్‌లో బత్తల సుజాత 1,600 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఫలితాన్ని ప్రకటించకుండా అధికారులు ఐదు సార్లు రీకౌంటింగ్ పెట్టి ఇబ్బందులు పెట్టారు. మొదటి సారి కౌంటింగ్ – 1,600 మెజారిటీ, రెండవ రీకౌంటింగ్ – 720, మూడవ రీకౌంటింగ్– 370, నాల్గవ రీకౌంటింగ్ – 155, ఐదవ రీకౌంటింగ్ తర్వాత 248 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్టు ప్రకటన చేశారు. అయితే 5వ సారి లెక్కించిన తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 450 ఓట్లు ఆధిక్యం వచ్చినట్టు తెలిసింది. అధికారులు చివరకు టీడీపీ నాయకులు కోరుకున్నట్టుగా విజయాన్ని అధికార పార్టీకి రాసిచ్చేశారన్న విజమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్కంఠ
శనివారం అర్ధరాత్రి వరకు కేవీబీపురం జెడ్పీటీసీ ఎన్నిక ఫలితం ఉత్కంఠగా మారింది. కౌంటింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలుపెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీ మెప్పు కోసం తహతహలాడుతున్న నాయుడుపేట సీఐ తురక వెంకటరమణ అత్యుత్సాహంతో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతల టార్గెట్‌గా దురుసుగా ప్రవర్తించిన సీఐ శనివారం ఏకంగా చిట్టమూరు తహసీల్దార్ రామయ్యపై అమానుషంగా ప్రవర్తించారు. తహసీల్దార్ ఎన్నికల విధులకు హాజరై నాయుడుపేటలోని కౌంటింగ్ కేంద్రం ఆవరణలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి సీఐ కుర్చీలో కుర్చుని ఉన్న తహసీల్దార్ వద్దకు వచ్చి ఇక్కడ నుంచి లేవాలని.. లేకుంటే చెంప చెళ్లుమనిపిస్తామని దుర్భాషలాడినట్లు తహసీల్దార్ వాపోయారు. తాను తహసీల్దార్‌నని, ఎన్నికల విధులకు హాజరయ్యానని చెప్పినప్పటికీ సీఐ అమానుషంగా వ్యవహరించినట్లు రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.


