సాక్షి, తిరుపతి : తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. పలు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచినా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఒకటికి ఐదారు సార్లు రీకౌంటింగ్ పేరుతో ఓట్లను తారుమారు చేసి అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందినట్లు డిక్లరేషన్లు పొందారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 జెడ్పీటీసీలకు గాను నాలుగు స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 31 చోట్ల ఎన్నికలు నిర్వహించగా నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో పెళ్లకూరులో కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, చిన్నగొట్టిగల్లులో బీ.యుగంధర్రెడ్డి, ఎర్రావారిపాళెం ఊటుకూరి రెడ్డెమ్మ, పెనగలూరు దువ్వూరి సుప్రజ ఉన్నారు. తిరుపతి రూరల్ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, రైల్వే కోడూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంబటి మురళి ముందంజలో ఉన్నారు. గెలుపు, ముందంజలో కలిపి 21 చోట్ల టీడీపీ, రెండు చోట్ల బీజేపీ, ఒక చోట జనసేన, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు. అలాగే జిల్లాలో మొత్తం 444 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 142 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 302 స్థానాల్లో శనివారం అర్ధరాత్రి సమయానికి గెలుపు, ముందంజలో ఉన్న లెక్కల ప్రకారం వైఎస్సార్‌సీపీ 84, కూటమి 204, స్వతంత్రులు 14 స్థానాల్లో ఉన్నారు.


