దాడిలో గాయపడిన దళితులపై కౌంటర్ కేసు పెడతారా? తిరుపతి జిల్లా పోలీసులు ఏ చట్టాన్ని అనుసరిస్తున్నారో చెప్పాలి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల ఆందోళన మద్దతుగా నిరసనలో పాల్గొన్న వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన
●
‘మాకు రెడ్‌బుక్ రాజ్యాంగం వద్దు.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే ముద్దు.. తిరుపతి పోలీసులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరిచిపోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అందుకే దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా గాయపడిన దళితులపైనే కౌంటర్ కేసు పెట్టారు.. దళితులపై దాడి చేసిన వారిని శిక్షించకుండా బాధితులపై కౌంటర్ కేసు పెట్టాలని భారత రాజ్యాంగంలో రాసి ఉందా..? ఇంక దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది?’ అని దళిత సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి రూరల్ : దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ బాధితులు, దళిత సంఘాల నేతలు ఆదివారం ఉదయం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారికి వైఎస్‌ఆర్ సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మద్దుతు తెలిపి పోలీస్ స్టేషన్ ముందు నడిరోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పోలీసులు ఏ చట్టాన్ని అమలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే తాగునీటి బోరును టీడీపీ గూండాలు కబ్జా చేసి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే అంబేడ్కర్ బొమ్మతో నిరసన తెలిపినందుకు మూకుమ్మడిగా దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోసించడం ఏమిటని నిలదీశారు. పోలీసుల ముందే దళితులపై దాడి చేసినా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
పటిష్ట భద్రత
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దళిత సంఘాల నాయకులు, భూమన కరుణాకరరెడ్డి వస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించి స్టేషన్ లోపలికి ఎవ్వరినీ రానీయకుండా అడ్డుకున్నారు. నిరసన కారులు రోడ్డుపై కూర్చోగానే ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కొంతసేపటి తర్వాత భూమనతో చర్చించి దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లో నిందితులు అరెస్టు కాకుంటే మరోసారి ఉద్యమిస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. ఆ తర్వాత ఆందోళనను విరమించారు.
దళితులపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?


