తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతి జిల్లా, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడమే కాకుండా ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ తమ సెల్ ఫోన్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన నెల్సన్ మండేలా అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఘటనా సమయంలో అప్రమత్తంగా లేకుండా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నటువంటి టీటీడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
తిరుపతి ఎడ్యుకేషన్ : నారాయణవనం జెడ్పీ ఉన్నత పాఠశాల తమిళ (సోషియల్) ఉపాధ్యాయుడు కె.మునివేలును సస్పెండ్ చేసినట్లు ఆదివారం డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పాఠశాల పూర్వ విద్యార్థినికి మొబైల్ ఫోను ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో సదరు విద్యార్థిని వేధింపులు తాళలేక మరణించించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మౌఖిక నివేదిక మేరకు శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నారాయణవనం మండల విద్యాశాఖాధికారి విచారించి తమకు అందజేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు.
శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం సుప్రభాత సేవలో భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.


