మేధస్సుకు పదునుపెడదాం
ఆవిష్కరణలను రూపొందిద్దాం
ఇన్‌స్పైర్ నమోదుకు సెప్టెంబర్
15 వరకు గడువు
తిరుపతి ఎడ్యుకేషన్ : పోటీ ప్రపంచంతో పోటీ పడేందుకు కొత్త ఇన్నోవేషన్లతోనే సాధ్యం. దీనికోసం శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసి ఎక్కువ మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్తకొత్త ఆవిష్కరణలకు అడుగులు పడేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగానే పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనల వైపుకు నడిపిస్తోంది. వారి చిట్టి మేధస్సుకు పదునుపెట్టించి వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిస్తోంది. విద్యార్థులు రూపొందించే ఆవిష్కరణలు మెరుగుపడాలన్నదే ఇన్‌స్పైర్ మనక్ ముఖ్య ఉద్దేశం.
అందులో భాగంగానే కేంద్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇన్‌స్పైర్ మనక్ పేరిట సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది. 2026–27వ సంవత్సరానికి సంబంధించి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఇన్‌స్పైర్‌కు అర్హులు. వీరు తమ గైడ్ టీచర్ల సహాయంతో కొత్త ఐడియాలతో వినూత్న ప్రయోగాలు చేపట్టవచ్చు.
పోటీ విధానం ఇలా..
ప్రతి జిల్లా నుంచి పంపిన నామినేషన్లను పరిశీలించి ఎంపిక చేసిన ఉత్తమ ప్రదర్శనలను జిల్లా స్థాయిలో ప్రదర్శనకు అనుమతి ఉంటుంది. ఎంపికై న ప్రాజెక్టును రూపొందించడానికి వీలుగా ప్రభుత్వమే విద్యార్థి ఖాతాలో రూ.10 వేలు జమచేస్తుంది. జిల్లా స్థాయి ప్రదర్శనలో ఎంపికయ్యే ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు, అక్కడ ఎంపికయ్యేవి జాతీయ స్థాయి ప్రదర్శనకు అనుమతిస్తారు. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్రవేత్తకు రూ.25వేల వరకు తమ ప్రాజెక్ట్ మెరుగు పరుచుకునేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర పతి భవన్, జపాన్ సందర్శనలతో పాటు ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులకు పేటెంట్ లభించే అవకాశం కూడా ఉంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఇన్‌స్పైర్ మనక్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎన్‌ఎస్‌పీఐఆర్‌ఈఏబ్ల్యూఏఆర్‌డీఎస్ అండ్ డీఎస్‌టీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి స్కూల్ అథారిటీ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అందులో న్యూరిజిస్ట్రేషన్ ఆప్షన్‌లోకి వెళ్లి పాఠశాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి సేవ్ చేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులన్నింటినీ జిల్లా అథారిటీ పరిశీలించి ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింకు వస్తుంది. ఆ ఐడీతో పాస్‌వర్డ్ క్రియోట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదు చేయాలి (లేదా) ఇన్‌స్పైర్ మనక్ యాప్‌లో విద్యార్థి ఆధారు నెంబరు, బ్యాంకు వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో ద్వారా స్కూల్ లాగిన్‌లో ఓపెన్ చేసి 100 పదాలలోపు ఉండేలా సంక్షిప్తంగా ప్రాజెక్టు వివరాలను నమోదు చేయాలి. సెప్టెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
వినూత్న ఆలోచనతో అందలం
మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచిస్తే అందలం ఎక్కగలమని రేణిగుంట మండలం, గుత్తివారిపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని గొల్లపల్లి రేష్మ నిరూపించింది. 2024–25వ సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఇన్‌స్పైర్ మనక్‌లో గైడ్ టీచర్ పి.మునిరెడ్డి పర్యవేక్షణలో బాయిల్డ్ ఎగ్ షెల్ పీలెర్ ప్రాజెక్టును ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. ఈ ఏడాది జూన్ 28నుంచి జూలై 4వ తేదీ వరకు జపాన్‌కు వెళ్లడంతోపాటు, సకూర పట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులో పాల్గొనింది.
కొత్త ఇన్నోవేషన్‌కు శ్రీకారం చుడుదాం రండి
బాల శాస్త్రవేత్తలుగా అడుగులు పడాలి
సరికొత్త ఆవిష్కరణలకు బీజం పడాలని కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్ మనక్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో దాగున్న ప్రతిభ, సృజనాత్మకతను గుర్తించి వారిని బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఈ ఏడాది ఇన్‌స్పైర్ మనక్‌కు జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు వచ్చేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా కలెక్టర్, తిరుపతి
ఆవిష్కరణలకు వేదిక ఇన్‌స్పైర్ మనక్
సరికొత్త ఆలోచనలకు ఇన్‌స్పైర్ మనక్ చక్కని వేదిక. జిల్లాలోని అన్ని యాజమా న్య ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు. సెప్టెంబర్ 15వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా సైన్సు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు 100శాతం నమోదయ్యేలా కృషి చేయాలి. – కేవీఎన్.కుమార్, డీఈఓ, తిరుపతి
వినూత్న ఆలోచతోనే విజయం
అందరిలా కాకుండా వినూత్నంగా అలోచించినప్పుడే విజయాన్ని అందుకోగలం. అందుకు మా విద్యార్థిని రేష్మ చక్కని ఉదాహరణ. సైన్స్ ప్రయోగాలపై ఆసక్తి ఉన్న తను మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెంకులను తీయడానికి పడుతున్న శ్రమని గుర్తించింది. దీనికి సులువైన మార్గాన్ని కనిపెట్టాలన్న ఆలోచనతో నన్ను సంప్రదించింది. కొత్త ఐడియాతో బాయిల్డ్ ఎగ్ షెల్ పీలెర్ ప్రాజెక్టును రూపకల్పన చేసి విజయం సాధించడంతో పాటు జపాన్‌కు వెళ్లే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది.
– పి.మునిరెడ్డి, సైన్స్ టీచర్, జెడ్పీ హైస్కూల్ ప్లస్, పద్మావతీపురం, తిరుపతి
జపాన్‌లో చదివే అవకాశం
గత ఏడాది నేను రూపొందించిన బాయిల్డ్ ఎగ్ షెల్ పీలెర్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వడంతో పాటు జపాన్ దేశాన్ని సందర్శించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వైజానిక ప్రదర్శనలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. జపనీయుల సంస్కృతి, వారి ఆచార వ్యవహరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పై చదువులకు జపాన్‌లో చదివేందుకు ఆ దేశం నాకు అనుమతివ్వడం సంతోషంగా ఉంది. నాకు సహకారం అందించిన గైడ్ టీచర్ మునిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్‌రెడ్డి, డీఈఓ కేవీఎన్.కుమార్, సైన్స్ అధికారి భానుప్రసాద్, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. – గొల్లపల్లి రేష్మ, ఇన్‌స్పైర్ మనక్–2024–25 విజేత, గుత్తివారిపల్లి
నిబంధనలు ఇవే..
అన్ని యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత పాఠశాలలు 3 ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాలలు 5 ప్రాజెక్టులు, హైస్కూల్ ప్లస్‌లు 7 ప్రాజెక్టులను రూపొందించాలి. సమాజంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, నిత్య జీవిత సమస్యలు, రైతు కూలీల సమస్యలు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై సృజనాత్మక నవీన పద్ధతిలో పరిష్కారం చూపించేందుకు వీలుంటుంది. ఈ ఏడాది డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, సమాజాభివృద్ధి, క్లీన్ ఇండియా అంశాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించాలి.
నమోదు ప్రక్రియ ఇలా..
విద్యార్థులు తమ గైడ్ టీచర్ మార్గదర్శకత్వంలో ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి, విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ కార్డు నంబరుతో నమోదు చేసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా పొందుపర్చి సంబంధిత రైటప్‌ను ఇన్‌స్పైర్ మనక్ యాప్‌లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర, సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి.


