తిరుమలలో వరుస చోరీలు | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో వరుస చోరీలు

Aug 3 2026 4:15 AM | Updated on Aug 3 2026 4:15 AM

● గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

తిరుమల: తిరుమలలో వరుస చోరీలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత వారం ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురికాగా, శుక్రవారం ఒక్కరోజే చైన్‌న్‌స్నాచింగ్‌, భక్తుల బ్యాగ్‌ చోరీ ఘటనలు వెలుగుచూశాయి. అయితే ప్రతి ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు వేగంగా స్పందించి గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేయడం విశేషంగా నిలిచింది.

కట్టుదిట్టమైన భద్రత.. అయినా..

తిరుమలలో భక్తుల భద్రత కోసం అలిపిరి నుంచే వాహనాలు, భక్తుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమల వ్యాప్తంగా సుమారు మూడు వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేశారు. పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, ఆక్టోపస్‌ బలగాలు భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ ఇటీవల వరుస చోరీలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

14 గంటల్లో విగ్రహం చోరీ కేసు ఛేదన

మొదటి ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటనా స్థలికి సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ప్రత్యేక బందాలతో దర్యాప్తు చేపట్టి, కేవలం 14 గంటల్లోనే నిందితుడిని ఒంగోలు రైల్వే స్టేషన్‌న్‌లో అదుపులోకి తీసుకున్నారు.

అతిథి గృహంలో భక్తుల బ్యాగ్‌ మాయం

రాంభగీచ అతిథి గృహం–3లో బస చేసిన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన భక్తులు వేకువజామున మేల్కొని చూడగా కిటికీ వద్ద ఉంచిన బ్యాగ్‌ కనిపించలేదు. బ్యాగులో సుమారు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆపిల్‌ వాచ్‌లు, ఇయర్‌పాడ్స్‌, రూ.40 వేల నగదు ఉన్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సీసీటీవీతో వేగంగా దర్యాప్తు

వరుస చోరీ ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ సీసీటీవీ నిఘా వ్యవస్థ పోలీసుల దర్యాప్తుకు కీలకంగా మారింది. ప్రతి కేసులో నిందితుల కదలికలను గుర్తించి స్వల్ప వ్యవధిలోనే అరెస్టు చేయడంతో కేసులు త్వరితగతిన ఛేదించగలిగారు.

రెండు గంటల్లోనే చైన్‌స్నాచర్‌ అరెస్ట్‌

పోలీసు క్వార్టర్స్‌ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ యువకుడు లాక్కెళ్లాడు. వెంటనే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి అలిపిరి వద్ద రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement