కళ్లు మూసుకుని | - | Sakshi
Sakshi News home page

కళ్లు మూసుకుని

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

కళ్లు

కళ్లు మూసుకుని

తరగతులకు హాజరు కాకుండా..

పరీక్ష రాయకుండానే సర్టిఫికెట్లు

ఉద్యోగం చేస్తూనే కోర్సులు పూర్తి చేస్తున్న అభ్యర్థులు

నర్సింగ్‌ కళాశాలలో రాజ్యమేలుతున్న అవకతవకలు

పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న యాజమాన్యాలు

రూ.లక్షలు దండుకుంటూ వ్యాపారంగా మార్చుకుంటున్న మాఫియా

హెల్త్‌ యూనివర్సిటీ అధికారుల అవినీతి.. నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ.. జిల్లాస్థాయిలో అధికారులకు పర్యవేక్షణ అర్హత లేమి.. ఇక ఏముంది.. అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు రారని నర్సింగ్‌ కళాశాలలే వసతి గృహాలు మారిన కాలేజీలు.. విద్యార్థులే పని మనుషులు..అడిగినంత డబ్బిస్తే చదవకనే సర్టిఫికెట్‌.. ఇదీ తిరుపతి నగరంలోని నర్సింగ్‌ కళాశాలల మాయాజాలం. మొత్తంగా కాసులకు హెల్త్‌వర్సిటీ అధికారులు తలొగ్గడంతో నర్సింగ్‌ మాఫియా విచ్చలవిడిగా సాగుతోంది.

తిరుపతి తుడా: ‘‘కరకంబాడి రోడ్డు కార్పొరేషన్‌ పరిధికి చివరన ఉన్న ఓ నర్సింగ్‌ కళాశాలలో సర్టిఫికెట్ల గోల్‌మాల్‌ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో పని చేసే పలువురు ఇక్కడ పలు కోర్సులు చదువుతున్నట్లు తెలుస్తోంది. 100 శాతం హాజరు చూపడం, పరీక్షలు వేరే వ్యక్తులతో రాయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులున్నాయి. అలానే పలు నర్సింగ్‌ కళాశాలలో ఇదే వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది’. నర్సింగ్‌ కళాశాలల మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. నర్సింగ్‌ విద్యార్థులకు వేధింపులు తప్పడం లేదు. కళాశాలలే వసతి సముదాయాలుగా, వాటిల్లో విద్యార్థులే పని మనుషుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నేరుగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రావడంతో ఇక్కడ అడిగే వారు కరువయ్యారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు స్థానిక అధికారులు వెళ్లి మమ అనిపించి చేతులు దులుపుకుంటున్నారు. కళాశాలలను తనిఖీ చేయాలంటే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకే పూర్తి అధికారం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేది లేదు, ఇక్కడ పర్యవేక్షించేది లేదు. తేడా అదిగో ఒకసారి వచ్చి అన్ని సక్రమంగా ఉన్నాయంటూ సర్టిఫికెట్‌ ఇచ్చి మామూళ్లు పట్టుకెళ్లడమే పనిగా పెట్టుకున్నారు.

పర్యవేక్షించే వారు కరువై...

నర్సింగ్‌ విద్యను చెప్పే అర్హత కలిగిన టీచర్లు లేకుండానే కళాశాలలను నిర్వహిస్తున్నారు. అనుమతులు లేని భవనాల్లోనే వీటిని నిర్వహిస్తున్నారు. కళాశాలలే వసతి కేంద్రాలుగా నడుపుతున్నారు. విద్యార్థులకు అందించే సౌకర్యాలు, వసతుల లేమితో విద్యార్థినులు నరకం అనుభవిస్తున్నారు. ఎంతమంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అందులో ఎంతమంది కళాశాలలకు వస్తున్నారు.. అసలు విద్యార్థులు కళాశాలలకు వస్తున్నారా? అన్న వాటిని పర్యవేక్షించేవారు కరువయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కానీ ఎస్వీ మెడికల్‌ కళాశాల కానీ వీటిని పర్యవేక్షించే అర్హత లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

సర్టిఫికెట్లు కావాలా నాయనా..

విద్య అభ్యసించకుండానే నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు ఫీజులు, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కక్కుర్తి పడి యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటర్‌ విద్యార్హతతో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఎమ్మెస్సీ నర్సింగ్‌ విద్యను చదువుతుంటారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సులు పూర్తి చేస్తేనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వారు పైచదువుల కోసం కళాశాలలకు రాకుండానే సర్టిఫికెట్లు ఇచ్చేలా నిర్వాహకులు బేరసారాలు సాగిస్తున్నారు. రూపాయి ఫీజు కట్టొద్దు, ఒక్కరోజు కళాశాలకు రాకపోయినా పర్వాలేదు, చివరికి పరీక్ష కూడా రాయాల్సిన పని లేదు అంతా మేమే చూసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే మీ కోర్సులు పూర్తి చేయించే బాధ్యత మాది అంటూ వల వేస్తున్నారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సులతో ప్రభుత్వ ప్రైవేటు నర్సులుగా పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వారిని గుర్తించి పైకోర్సు సర్టిఫికెట్లు ఇస్తాం, మా కళాశాలలో చేరండి అంటూ మాఫియాను నడిపిస్తున్నారు. తీరా సర్టిఫికెట్‌ ఇచ్చేనాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిపోదని, అదనంగా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. నర్సింగ్‌ కళాశాలలో ఇలా అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకుంటున్న పట్టించుకునేవారు కరువయ్యారు.

నర్సింగ్‌ మాఫియా!

నిర్వాహకులే అసలు దొంగలు

జిల్లాలో 40కి పైగా నర్సింగ్‌ కళాశాలలు పలు కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలల యజమానులు మాఫియాను నడిపిస్తున్నారు. అభం శుభం తెలియని విద్యార్థులను వేధించడం అక్రమంగా వసూలు చేయడం వంటివి పోటీ పడి పెంచి పోషిస్తున్నారు. ఏడాదిలో ఒకసారి వచ్చే పర్యవేక్షణ కమిటీలను మేనేజ్‌ చేయడం, స్థానికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు కళాశాల యజమానులను కాపాడుకోవడమే లక్ష్యంగా నర్సింగ్‌ కళాశాలల అసోసియేషన్‌ పనిచేస్తోంది. కళాశాలల్లో జరిగే అఘాయిత్యాలు, ఘోరాలు, వేధింపులను ఎప్పటికప్పుడు అణిచివేయడం, లొసుగుల విషయాలు బయటకు పొక్కకుండా చేయడమే అసోసియేషన్‌ నేతలు పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఒక్కో కళాశాల నుంచి ఏడాదికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.

కళ్లు మూసుకుని1
1/1

కళ్లు మూసుకుని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement