ఒకటిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జిల్లాకు రాక
తిరుపతి అర్బన్: తిరుపతి రూరల్ మండలం దా మినేడు వద్ద నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు మార్చి ఒకటో తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ హాజరుకానున్నారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఆయన ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుతో కలసి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దామినేడు వద్ద నిర్మించనున్న నూతన జిల్లా కోర్టు కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొననున్న నేపథ్యంలో తాజ్ హోటల్, భూమిపూజ జరిగే ప్రాంతాల్లో భద్రత, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, ఇతర సౌకర్యాలను పకడ్బందీ నిర్వహించాలని, పోలీసు, అగ్నిమాపక అధికారులు, ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. భూమి పూజకు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర అత్యున్నత న్యాయమూర్తులు పాల్గొననున్నారని, నోడల్ అధికారులను నియమించడం జరుగుతుందని, చిన్నపాటి లోపాలకు తావు లేకుండా చూడాలన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్, చిత్రంలో ఎస్పీ


