ప్రకృతి వనరుల విధ్వంసం
తిరుపతి రూరల్: ‘చంద్రగిరి చరిత్రలో నాని వంటి అవినీతి ఎమ్మెల్యేను చూడలేదు.. ప్రశాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ కక్షలు రేపి.. తాను మాత్రం అవినీతికి తెరలేపారు.. ప్రకృతి వనరులను విధ్వంసం చేస్తున్నారు. వారం రోజుల్లో అన్నీ ఆపేయాలి.. ఆ తరువాత మీ అవినీతి భాగోతం మొత్తం బయటపెడతాం.. ఎక్కడికక్కడ తవ్వకాలను అడ్డుకుంటాం..’’ అని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హెచ్చరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకృతి వనరులను సర్వనాశనం చేస్తున్న పులివర్తి నాని అవినీతి, అక్రమాలపై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతి ప్రెస్‌క్లబ్ వేదికగా ఎండగట్టారు. ఎమ్మెల్యే నాని అక్రమ సంపాదనకు కొండలు, గుట్టలు, చెరువులు, వాగులు, వంకలు ఆనవాళ్లు కోల్పోతున్నాయన్నారు. రూ.కోట్ల విలువైన మట్టి, ఇసుకను తవ్వేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఏ నాయకుడైనా తన వద్దకు ఎవరైనా వచ్చి ఉపాధి కావాలంటే తన చేతనైన సాయం చేయడమో, ఉద్యోగం తీసి ఇవ్వడమో చేస్తారని, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దగ్గరకు వెళ్లి తనకు ఉపాధి కావాలంటే ఒక టిప్పర్ కొనుక్కో బతుకుదెరువు చూపిస్తా.. అంటూ ప్రకృతి వనరులను దోచేసే బాధ్యతను అప్పగిస్తున్నారంటే ఆయన నైజం ఎలాంటిదో అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసిన నారా రామ్మూర్తి నాయుడు, గల్లా అరుణకుమారి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేదని, పులివర్తి నాని ధన దాహానికి ప్రకృతి విలవిలలాడుతోందని ఘాటుగా విమర్శించారు.
25 ప్రదేశాల్లో ఇసుక, మట్టి తవ్వకాలు
చంద్రగిరి నియోజకవర్గంలోని 25 ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ నుంచే మట్టి, ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా సాగిస్తున్నట్టు తెలిపారు. అధికారులకు అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. అక్రమ సంపాదన కోసం చెరువులు, గుట్టలు, కొండలను సర్వనాశనం చేస్తున్న వారిపై ప్రజలందరితో కలసి పోరాటం చేస్తానని హెచ్చరించారు.
ప్రమాదంలో దళవాయి చెరువు
తిరుపతి రూరల్ మండలం దళవాయి చెరువును ఆరు నెలలుగా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారని, చెరువు ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగైపోయాయన్నారు. ఆనకట్ట కూడా తెగిపోయే పరిస్థితిలో ఉందన్నారు. ఆ చెరువు తెగిందంటే చెరువు కిందనున్న గ్రామాలు పూర్తిగా జలమయమైపోతాయన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మునీశ్వరరెడ్డి, నరేష్‌రెడ్డి, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, సింహాల మోహన్, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు చిన్నియాదవ్, సీనియర్ నేతలు దామినేటి కేశవులు, చెంగల్‌రెడ్డి పాల్గొన్నారు.
తీరని గర్భశోకం
తిరుపతి రూరల్ మండలంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వేయడంతో నాలుగు నెలల క్రితం నలుగురు యువకులు దుర్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని చెప్పి మొండి చేయి చూపారని, ఆ గర్భ శోకానికి కారకులు ఎవరని? ఇసుక అక్రమ తవ్వకాలు చేసిన వారు కాదా..? అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహించే ఎమ్మెల్యే పులివర్తి నాని కాదా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో అలా.. అధికారంలో ఇలా..
ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి వద్ద స్వర్ణముఖి నదిలో ఓ ఇసుక గుంతలో కాలేజీ కుర్రాడు పడి మరణిస్తే నానా యాగీ చేసి, తమకు సంబంధం లేని విషయంలో తమపై ఆరోపణలు చేశారన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఈరోజు అదే ప్రదేశంలో ఇసుక తవ్వకాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
మట్టిని తవ్వి.. పొలంగా మార్చుకుని..
రామచంద్రాపురం మండలంలోని గుండోడుకనం వద్ద కొండలను తవ్వేసి ఆ మట్టిని అమ్ముకోవడమే కాకుండా తవ్వేసిన ప్రాంతంలో భూమిని చదును చేసి పొలాలుగా మార్చేసుకుంటున్నారంటే ఎమ్మెల్యే నాని ఎంతకు బరితెగించారో అందరు గుర్తించాలని, సుమారు 25 ఎకరాలకుపైగా నానీ అనుచరులు అక్కడ పాగా వేశారంటే ఆయన ప్రకృతి వినాశనానికి ఎంతలా సాయ పడుతున్నారో ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలన్నారు.
ప్రకృతి వనరుల విధ్వంసం
ప్రకృతి వనరుల విధ్వంసం


