ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: ఆదర్శ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐదు ఆదర్శ పాఠశాలలున్నాయని చెప్పారు. అన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓసీ, బీసీలకు చెందిన విద్యార్థులు 2014 సెప్టెంబర్ ఒకటి నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని చెప్పారు. అలాగే జిల్లాలో ప్రభుత్వం లేదా ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలో 2024–25, 2025–26 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలని చెప్పారు. 2025–26లో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్ పొంది ఉండాలని వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.పీఏసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తులు చేయడానికి ఓసీలు, బీసీలు రూ.200, ఎస్సీలు, ఎస్టీలు రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. ప్రవేశాలు ప్రతిభ ఆధారంగానే ఉంటాయని స్పష్టం చేశారు.
టీటీడీకి రూ.50 లక్షల విరాళం
తిరుమల: హైదరాబాద్‌కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు శుక్రవారం రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఏపీఓఎస్‌ఎస్ ఇంటర్ హాల్‌టికెట్ల విడుదల
తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఇంటర్మీడియట్ (ఏపీఓఎస్‌ఎస్) పబ్లిక్ పరీక్షలకు హల్ టికెట్లు విడుదలైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు హజురుకానున్న అభ్యాసకులు సంబంధిత స్టడీ సెంటర్ల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే అభ్యాసకులు తమ హాల్‌టికెట్‌ను మనమిత్ర సేవ ద్వారా కూడా పొందవచ్చన్నారు. వాట్సాప్ ద్వారా 95523 00009 నవంబర్‌కు హాయ్.. అనే సందేశాన్ని పంపితే...వారు అడిగే అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను పూర్తిస్తే...ఆ మేరకు డౌన్ చేసుకునే సౌలభ్యం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయులు, స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లు అభ్యాసకులకు తెలియజేసి హాల్‌టికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 57,682 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,020 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
గ్రేడ్–4,5 కార్యదర్శులకు శిక్షణ
ఏర్పేడు: మండలంలోని అంజిమేడులో జిల్లా లోని 75 మంది గ్రేడ్–4, గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజిమేడు పంచాయతీని క్షేత్రసందర్శన చేయించారు. విస్తరణ శిక్షణ కేంద్రంలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా వీరు ఏర్పేడు డిప్యూటీ ఎంపీడీఓ రమణకుమార్ పర్యవేక్షణలో క్షేత్రపర్యటన చేశారు. భవన నిర్మాణ అ నుమతులు, లేఅవుట్ల నిర్వహణ ఎలా నిర్వ హించాలి.. నిర్వహణలో గ్రామ పంచాయతీల పాత్ర, డిజిటలీకరణలో భాగంగా లేఅవుట్లకు ఏ విధంగా అనుమతులు ఇస్తారన్న అంశంగురించి వివరించారు. చట్టవిరుద్ధంగా వేసినటువంటి లేఅవుట్లపై చర్యలు ఎలా చేపట్టాలనే అవగాహన కల్పించారు. శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ సభ్యులు అమర్నాథ్, మధుసూదన్, పంచా యతీ కార్యదర్శి గోవిందయ్య పాల్గొన్నారు.


