ఆగని ఇసుక దందా..!
చంద్రగిరి: మండలంలోని స్వర్ణముఖినది నుంచి వారం రోజులుగా భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నా పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు రోజుకు 50 టిప్పర్లకు పైగా ఇసుకను అక్రమంగా తరలించి, ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే తాము అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుకను తరలిస్తున్నామంటూ కలరింగ్ ఇస్తున్నారు. అధికారులు సైతం ఇసుకాసురులకు తమ వంతు పాటుపడుతూ అది అభివృద్ధి కార్యక్రమాలకు తరలిస్తున్నారనడంతో ప్రజలు నవ్వుకునే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల అభివృద్ధి పనులకు రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను సరఫరా చేసుకుంటున్నారు. చంద్రగిరిలో మాత్రం ఇందుకు భిన్నంగా నదిలో నుంచి ఇసుకను తోడేస్తున్నా, ప్రభుత్వ పనులకు తరలిస్తున్నారంటూ సాక్షాత్తు తహసీల్దార్ చెప్పడం విడ్డూరంగా ఉందంటూ పలువురు మండిపడుతున్నారు.
వారం రోజులకు రూ.11లక్షల డీల్
నాగయ్యగారిపల్లి నుంచి ఇసుక స్మగ్లింగ్ కోసం వారం రోజులకు గాను రూ.11లక్షలు డీల్ కుదిరినట్లు ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. గ్రామంలోని కొంత మంది టీడీపీ నేతలు గ్రామాభివృద్ధి పేరిట ఈ డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారుల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కూడా కొంత మేర ముట్టజెప్పినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదనన్న వాదనలు వినిపిస్తున్నాయి.


