స్విమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలు
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పేషంట్ల సౌకర్యార్థం పలు రకాలైన మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ క్లినిక్‌కు నేరుగా నమోదు చేసుకోవడానికి పేషంట్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్విమ్స్ క్లినిక్‌లో సంప్రదించాలని సూచించారు. మరి న్ని వివరాలకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు 83339 97968 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
పన్ను ఎగవేత
నియంత్రణకు చర్యలు
తిరుపతి అర్బన్: పన్ను ఎగవేత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, పన్ను ఎగవేత కేసుల్లో పోలీసులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులు, జాయింట్ కమిషనర్ కమర్షియల్ టాక్స్ రవీంద్రనాథ్ రెడ్డితో కలసి జీఎస్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ నుంచి ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా రిజిస్ట్రార్ శ్రీరాంకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పన్ను ఎగవేత నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే పన్ను ఎగవేతకు చెందిన ఆస్తులను గుర్తించినప్పుడు వాటిని 22ఏ కింద పెట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వరలక్ష్మి, రేణుక, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహురెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్ వద్ద ఎస్టీయూకి చెందిన ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థికపరమైన అంశాలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ప్రధానంగా డీఏ బకాయిలు, మెడికల్ రియింబర్స్‌మెంట్, సంపాదిత సెలవుల బకాయిలు, పెండింగ్‌లోని ఏపీజీఎల్, పీఎఫ్ లోన్స్, 12వ పీఆర్సీ, ఐఆర్ 30శాతం తదితర సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి మునికృష్ణమనాయుడు తాజా బడ్జెట్‌లో తమ సమస్యలకు అవసరం అయిన నిధుల కేటాయించాలని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ చైర్మన్ నారాయణ వారికి మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు ఆదినారాయణరెడ్డి, అశోక్, గురుప్రసాద్, రవిశంకర్, రామకృష్ణ, దేవేంద్ర, వాసు, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.


