లంకేశ్వరుడిపై లయకారుడు
స్వామి,అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ
శ్రీకాళహస్తి: అసుర జాతిలో పుట్టిన రావణుడు బ్రహ్మణోత్తముడు..అత్యంత శివభక్తి పారాయణుడు. కైలాసాన్ని తన శిరస్సుకెక్కించుకుని.. రు ద్రవీణాగానంతో పరమేశ్వరుడిని మెప్పించిన భక్తాగ్రేసరుడు. అందుకే మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ముక్కంటీశ్వరుడు ధశకంఠుడిపై అధిరోహించాడు.
స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబ మయూర వాహనాన్ని అధిరోహించి, భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. వినాయకుడు మూషిక వాహనంపై, శ్రీవల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండీకేశ్వరస్వామి, భక్త కన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బంగారు యాళి వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప కొలువుదీరారు. కళాకారుల కోలాటాలు, నందుల వాయిద్యాలు, శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిసరాలు మార్మోగాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా జ్ఞానప్రసూన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. మేళ,తాళాల మధ్య పట్టువస్త్రాలు, సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ఆలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయిలకు అందజేశారు.
లంకేశ్వరుడిపై లయకారుడు


