ఇంటర్మీడియట్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

తిరుపతి అర్బన్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి, డీఈఓ కేవీఎన్‌ కుమార్‌తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జిల్లాలోని 84 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నుంచి గూడూరుతోపాటు కోట మండలాలు నెల్లూరుకు వెళ్లిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరీక్షల నిర్వహణ బాధ్యత నెల్లూరు అధికారులు చూస్తారని స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాకు రావడంతో ఆ నియోజకవర్గంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటి నిర్వహణ బాధ్యత తిరుపతి అధికారులదేనని వెల్లడించారు. మొదటి సంవత్సర పరీక్షలు 30,319 మంది, రెండో సంవత్సర పరీక్షలు 30,696 మంది రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తంగా 61,015 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని ఆదేశించారు. 4 ప్లయింగ్‌ స్క్వాడ్‌లు, 10 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు పరీక్షలను పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. ప్రశ్నాపత్రాలను నిల్వచేయడానికి 28 స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యాశాఖ నుంచి ఏర్పాటు చేసిన 302 మంది ఇన్విజిలేటర్లు క్రమం తప్పకుండా వారికి కేటాయించిన కేంద్రాల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని వెల్లడించారు. మాల్‌ ప్రాక్టీస్‌, మాస్‌కాఫీయింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు ల కోసం ఆర్‌ఐవో ఆఫీస్‌లో కంట్రోల్‌ రూమ్‌ 0877 237200 నెంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈసీ నుంచి జీవీ ప్రభాకర్‌రెడ్డి, రెడ్డిరామరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement