నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
తిరుపతి అర్బన్: పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణత సాధించిన యువతీయువకులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని వెల్లడించారు. రష్యాకు సంబంధించిన సైబర్ స్టీల్ కంపెనీలో మెటల్, పైప్‌నకు చెందిన ఉద్యోగులకు ఐటీఐ, డిప్లొమా చదువుకున్న వారు ఏడాది పాటు అనుభవం ఉన్న యువతకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన 24–40 ఏళ్లు వారు రెండేళ్లు ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ విభాగాల్లో అనుభవం ఉన్న యువతీ, యువకులకు దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. అదనపు సమాచారం కోసం 91609 12690 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేడు పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లు శనివారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వస్తున్న నేపథ్యంలో ముందు రోజు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో 2,64,902 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. శనివారం పంపిణీ చేయకుండా మిగిలినపోయిన వారికి ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. 300 మీటర్ల లోపు దూరం నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముక్కంటి హుండీ ఆదాయం రూ.2.03 కోట్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.2,03,77,227 వచ్చినట్లు ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయ ఆవరణలోని కొట్టు మండపం వద్ద శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 94 గ్రాములు, వెండి 677 కిలోలు, విదేశీ కరెన్సీ 181 వచ్చింది. ఈ హుండీ లెక్కింపును పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బాపిరెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు.
పీజీ తొలి సెమిస్టర్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో పలు పీజీ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల డీన్ ఆచార్య సురేంద్ర బాబు, నియంత్రణాధికారి డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంఏ, ఎమ్మెస్సీలోని పలు విభాగాలకు చెందిన ఫలితాలు శుక్రవారం విడుదల చేశామని, ఫలితాల కోసం విద్యార్థులు మనబడి వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
జపాన్ సైన్స్ ప్రొగ్రామ్‌కు ఎస్వీయూ బృందం
తిరుపతి సిటీ: జపాన్ దేశం టోయామాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ ఆధ్వర్యంలో వచ్చే నెల 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే సాకురా సైన్స్ ఎక్స్‌ఛేంజ్ ప్రొగ్రామ్‌కు ఎస్వీయూ బృందం హాజరుకానుంది. ఈ మేరకు ఎంపికై న బృందానికి వీసీ నర్సింగరావు శుక్రవారం ప్రయాణ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జపాన్‌లో జరిగే సాకురా సైన్స్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కు వర్సిటీ నుంచి ఫిజిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ హేమలత రుద్రమదేవితోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి బాలాజీ ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి సంజయ్ యాదవ్‌తో కూడిన బృందం హాజరుకానున్నారని తెలిపారు. విద్యా, పరిశోధన, అధునాతన సైన్‌న్స్, టెక్నాలజీపై అవగాహనతోపాటు ప్రయోగశాల సందర్శనలు, నిపుణుల ఉపన్యాసాలు, సైన్‌న్స్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం ప్రధాన లక్ష్యంతో ఈ ప్రొగ్రామ్ జరగనుందని చెప్పారు. ఎంపికై న బృందాన్ని రెక్టార్ అప్పారావు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు


