నేడు చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి రాక
సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్న చెవిరెడ్డి
భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు
నాలుగు ప్రాంతాల్లోహారతులకు ఏర్పాటు
తిరుపతి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 226 రోజుల తరువాత తిరిగి చంద్రగిరి నియోజకవర్గానికి శనివారం వస్తున్నారు. ఆ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తుండగా తుమ్మలగుంట వాసులు చెవిరెడ్డి చేత గ్రామ దేవతలకు పూజలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి పరిసరాలకు చేరుకునే చెవిరెడ్డికి అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
దామినేడు వద్ద ఘన స్వాగతం
విజయవాడ నుంచి రోడ్డు మార్గం మీదు వచ్చే చెవిరెడ్డికి చంద్రగిరి నియోజక వర్గంలోకి అడుగుపెట్టే దామినేడు వద్ద ఘన స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్‌తో గజమాలలను వేయడం, హారతులతో సాదరంగా ఆహ్వానించడంతోపాటు పూలవర్షం కురిపించేలా నిర్ణయించారు. అలాగే తనపల్లి సర్కిల్, వేదాంతపురం సర్కిల్, రామానుజపల్లి సర్కిల్ వద్ద ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు కార్యకర్తలు కలసి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. చివరగా తుమ్మలగుంట తెలుగుతల్లి విగ్రహం వద్ద గ్రామస్తులు దిష్టి తీసి, ఆయనను గ్రామంలోకి ఆహ్వానించనున్నారు. ఆ తరువాత ఆయన కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, శ్రీ శక్తి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు.


