ఇసుక దందా ఆగేంతవరకు పోరాటం సాగిస్తా
కలువాయి(సైదాపురం): ‘అధికారపార్టీ నేతలు ధన దాహానికి సహజవనరులు అడుగంటి పోతున్నాయి. అక్రమ తవ్వకాలతో పెన్నానది గర్భశోకంతో అల్లాడిపోతోంది. ఈ అక్రమ ఇసుక దందా ఆగేంత వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తాను.’ అని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి శపథం చేశారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలతో కలసి కలువాయి మండలంలోని తెలుగురాయపురం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను శుక్రవారం నేదురుమల్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగురాయపురంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా కూటమి నేతలు బరితెగింపునకు నిదర్శనమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో పెన్నానదిలో పెద్ద పెద్ద యంత్రాలతో నిత్యం వందల సంఖ్యలో ఇక్కడ నుంచి ఇసుకను స్థానిక రెవెన్యూ కార్యాలయం మీదుగానే తరలించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధికి తెలియకుండా ఈ ఇసుక దందా జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. నదీగర్భంలోని రహదారి ఏర్పాటు చేయడంతోపాటు యంత్రాలను అక్కడే ఉంచడం, ఇసుక రీచ్‌పై టీడీపీ జెండా రెపరెపలాడడం చూస్తుంటే అధికారపార్టీకి చెందిన నేతలు ఎంత బరితెగించారన్న విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఇసుక దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలువాయి జెడ్పీటీసీ సభ్యులు అనీల్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు మాగినేని కృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మన్నారపు రవికుమార్‌యాదవ్, శ్రీనివాసులరెడ్డి, వెందోటి కార్తీక్‌రెడ్డి, పులి ప్రసాద్‌రెడ్డి, నేతలు నారాయణరెడ్డి, చిట్టేటి హరికృష్ణ, సేతరాసి బాలయ్య, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


