అనుమానాస్పదంగా మహిళ మృతి
చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటీఆర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మంగళం బీటీఆర్ కాలనీకి చెందిన జయకోడి(43) కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తోటి కూలీలతో పనులు చేసే జయకుమార్‌తో ఆమె కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన నివాసంలో జయకోడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతోపాటు జయకుమార్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుధాకర్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం మెడపై చున్నీతో లాగి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


