పండక్కి ఊరెళుతూ పరలోకాలకు..
నాగలాపురం: పండక్కి ఊరెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగలాపురం మండలం, కృష్ణాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని దక్షిణపుకోట వీధికి చెందిన టి.శేఖర్ కుమారుడు టి.హర్షవర్ధన్(13) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల నిమిత్తం తన మేనమామ, అతని కొడుకుతో కలిసి ముగ్గురు ద్విచక్రవాహనంలో తిరుపతికి బయలు దేరారు. కృష్ణాపురం స్పీడ్ బేకర్ వద్ద వెనుక కూర్చుని ఉన్న హర్షవర్థన్ ద్విచక్ర వాహనం నుంచి అదుపు తప్పి కింద పడిపోయాడు, ఆ సమయంలో ఊత్తుకోట్టై వైపు వెళుతున్న టిప్పర్ హర్షవర్థన్ తలపై ఎక్కడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను సురుటుపల్లి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. మృతుని తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు.


