పిన్నెల్లికి బియ్యపు మధు పరామర్శ
శ్రీకాళహస్తి: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డిని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. జైలులో పిన్నెల్లిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిన్నెల్లిపై అక్రమ కేసులు బనాయించిందని విమర్శించారు. జైలుకు వచ్చిన తర్వాత పిన్నెల్లి దాదాపు 9 కిలోల బరువు తగ్గారని, జైలులో ఖైదీలకు సరైన ఆహారం అందించడం లేదని ఆరోపించారు. కనీసం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. గతంలో అండమాన్–నికోబార్ జైళ్లలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వేధింపులను వెంటనే మానుకోవాలని హితవు పలికారు.


