పాలన గాడి తప్పింది!
రీసర్వే డీటీలకు సెక్షన్ పగ్గాలు
జిల్లా పరిపాలనా కార్యాలయమైన కలెక్టరేట్ కీలకం.. అయితే ఈ కార్యాలయంలో పోస్టు తగిన స్థాయి అధికారులు లేరు.. పచ్చనేతలకు లాల్‌సలాం కొట్టే కిందిస్థాయి ఉద్యోగులు సెక్షన్ల హెడ్‌లుగా నియమితులు కావడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
తిరుపతి అర్బన్: కలెక్టరేట్ కార్యాలయం జిల్లాకు గుండెకాయ లాటింది. కీలకమైన అన్నీ విభాగాలకు చెందిన వ్యవహారాలను చక్కపెట్టాల్సింది కలెక్టరేట్‌లోనే. ఈ క్రమంలోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ నుంచి హెచ్ వరకు 8 విభాగాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి విభాగానికి హెడ్‌గా తహసీల్దార్ స్థాయి అధికారిని ఏర్పాటు చేశారు. దీంతో పాలన సజావుగా సాగిపోయింది. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో తాజాగా పలు విభాగాల హెడ్‌ల నియమకం చేపట్టారు. ఇప్పటికే ఒకరిద్దరు బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన వారు సంక్రాంతి తర్వాత బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే కీలకమైన మూడు విభాగాల్లో హెడ్‌లుగా రీ సర్వే డీటీలకు బాధ్యతలు అప్పగించడంపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కలెక్టరేట్‌లో 14 మంది వీఆర్వోలకు వివిధ చోట్ల పోస్టింగ్ ఇవ్వడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన వీఆర్వోలను కలెక్టర్‌లో కీలకమైన చోట్ల నియమించడంపై చర్చసాగుతోంది. మొత్తంగా కలెక్టరేట్ పాలన గాడి తప్పుతుందని పలు విమర్శలు వస్తున్నాయి.
కీలకమైన ఎఫ్ సెక్షన్ హెడ్‌గా కే.స్వాతి(రీసర్వే డీటీ) సీ సెక్షన్‌కు హెడ్‌గా పి. బాలాజీ( రీసర్వే డీటీ)లకు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఈ సెక్షన్‌కు సంబంధించి ఇద్దరు రీ సర్వే డీటీలు సీవీఎన్‌ఎన్ శిరీషా, కే. మాధవి ఉండడంతో ఎవరికి హెడ్‌గా ఇవ్వాలో తెలియక.. ప్రస్తుతం నియమించకుండా ఖాళీగా ఉంచారు. మరోవైపు కీలకమైన పీజీఆర్‌ఎస్ నోడల్ ఆఫీసర్‌గా కేఎం రోజ్‌మాండ్(ఎస్‌డీసీ)ఉన్నప్పటికీ ఆ సెక్షన్‌లో మరో తహసీల్దార్ స్థాయి అధికారి ఉండేవారు. అయితే ఈ సారి ఆ స్థానాన్ని డీటీతో సరిపెట్టేశారు. ఏ అండ్ బీ సెక్షన్ హెడ్, కలెక్టరేట్ ఏఓగా పనిచేస్తున్న వై. రమేష్‌బాబుకు(తహసీల్దార్) ఎలక్షన్ సెక్షన్ హెడ్‌గా బాధ్యతలు అప్పగించారు. అలాగే తిరుపతి రూరల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న బి.రామాంజుల నాయక్‌ను బదిలీపై కలెక్టర్ ఏఓగా, ఏ అండ్ బీ సెక్షన్ హెడ్‌గా నియమించారు. జీ సెక్షన్ హెడ్‌గా ఎస్. శివప్రసాద్(తహసీల్దార్), ప్రోట్‌కాల్ సెక్షన్ హెడ్‌గా జే. శివశంకర్ నాయక్(ఎస్‌డీసీ), లీగల్ సెల్ హెడ్‌గా వి. దేవేంద్రరెడ్డి(ఎస్‌డీసీ)ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. మొత్తంగా మూడు సెక్షన్‌లకు హెడ్‌లుగా డీటీలను ఏర్పాటు చేయడం, కీలమైన పీజీఆర్‌ఎస్ సెక్షన్‌కు తహసీల్దార్‌ను ఏర్పాటు చేయకపోవడం, 14 మంది వీఆర్వోలకు కలెక్టరేట్‌లో కీలకమైన చోట్ల పోస్టింగ్‌లు ఇవ్వడంపై చర్చసాగుతుంది.
కీలకమైన విభాగాలు రీ సర్వే డీటీలకు అప్పగింత


