చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి?
పెళ్లకూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి పాలనలో రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో అడ్డుకోవడం చంద్రబాబు నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. రాయలసీమ రైతుల దాహార్తిని తీర్చడం కోసం జలగం వెంగళరావు హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు ప్రాజెక్టుకు 11వేల క్యూసెక్కులు మాత్రమేనని తెలిపారు. అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హంపీ–పోతిరెడ్డిపాడు వరకు పాదయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ని 11వేల క్యూసెక్కుల నుండి 44 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. అలాగే శ్రీశైలం నీటిమట్టం 845 అడుగులకు తగ్గకుండా పోతిరెడ్డిపాడు నుంచి 7 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అధికారికంగా 454 జీఓను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.


