అడుగడుగునా ఆంక్షలు
సైదాపురం/రాపూరు : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు భగ్గుమన్నారు. సీమతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతుల భవిష్యత్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో కలిసి కండలేరు ప్రాజెక్టు సందర్శనచేపట్టారు. అయితే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాపూరు మండలం తానంచెర్ల వంతెన వద్ద వాహనాలను అడ్డుకున్నారు. కేవలం పది మంది మాత్రమే వెళ్లాలని హుంకరించారు. దీంతో కాకాణి, నేదురుమల్లి వాగ్వాదానికి దిగారు. మేము ఉగ్రవాదులమా.. మా హక్కులను హరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. చివరకు వాహనాల్లో నేతలను మాత్రం అనుమతించడంతో వారు కండలేరుకు చేరుకున్నారు. కార్యకర్తలు కాలినడకనే ప్రాజెక్టుకు చేరాల్సి వచ్చింది. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, మండల కన్వీనర్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కార్తీక్‌రెడ్డి, మధురెడ్డి పాల్గొన్నారు.


