గ్రామ కమిటీలే ప్రధాన బలం
వరదయ్యపాళెం : సంస్థాగతంగా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలే 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రధాన బలమని పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎంపీ గురుమూర్తితో కలిసి వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు, కేసులు, ఇబ్బందులను పలువురు నేతలు వివరించారు. అనంతరం రఘునాథరెడ్డి మాట్లాడుతూ పార్టీకి సంస్థాగతంగా బలమైన పునాదులు వేసేందుకు గ్రామ కమిటీల నియామకానికి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీలోపు కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని దిశానిర్ధేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సర్కారుపై వ్యతిరేకత
చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, ఎన్నికల హామీలను విస్మరించడం, రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తుండడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఎంపీ గురుమూర్తి విమర్శించారు. 2029లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ గ్రామ కమిటీల నియామకానికి నేతలు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ కమిటీల ఏర్పాటుకు శ్రేణులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. పార్టీ సత్యవేడు పరిశీలకులు కల్పలతా రెడ్డి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిశీలకుడు బీరేంద్ర వర్మ, తిరుపతి, చిత్తూరు జిల్లాల సోషల్ మీడియా కన్వీనర్ వేలూరు రాకేష్, రాష్ట్ర కార్యదర్శి కామినేని సత్యనారాయణ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సుశీల్‌కుమార్ రెడ్డి , అపరంజిరాజు , దయాకర్ రెడ్డి , చలపతిరాజు, మణి నాయుడు, సొరకాయలు, గవర్ల కృష్ణయ్య , ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కేవీ భాస్కర్ నాయుడు, నిరంజన్‌రెడ్డి, ఎంపీపీలు ధనలక్ష్మి, అనిల్‌కుమార్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ కటికం దీప, నాయకుడు మాధవ్ రెడ్డి పాల్గొన్నారు.


