కోలాహలంగా పక్షుల పండుగ
సూళ్లూరుపేట : ఫ్లెమింగో ఫెస్టివల్– 2026లో భాగంగా ఆదివారం రెండోరోజు సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం పర్యాటకులతో కళకళలాడింది. పలు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో నేలపట్టు పక్షులు కేంద్రం, భీములవారిపాళెం పడవల రేవు, అటకానితిప్ప పర్యావరణ విజ్ఞానకేంద్రం కిక్కిరిసింది. పర్యాటకులు ఫిల్మ్‌షో వీక్షించేందుకు పోటెత్తారు. పక్షులు పుట్టుక, వాటి జీవన విధానం తెలియజేసే మ్యూజియంలో బారులు తీరారు. నేలపట్టులో పక్షులను చూసేందుకు, భీములవారిపాళెం పడవల రేవులో బోట్ షికారుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఆసక్తి చూపారు. సూళ్లూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో హోరాహోరీగా సాగిన కబడ్డీ, వాలీబాల్ పోటీల ఫైనల్స్‌ను వీక్షించి కరతాళధ్వనులు చేశారు.
సరస్సులో ఫ్లెమింగోలు
శ్రీహరికోట–సూళ్లూరుపేట మార్గానికి ఇరువైపులా పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ ప్రకృతి ప్రియులకు కనువిందు చేశాయి. సరస్సులో నీరు తక్కువగా వుండడంతో ఫ్లెమింగోలు రోడ్డుకు పక్కనే గుంపులు గుంపులుగా చేరి దర్శనమిచ్చాయి. నేలపట్టు పక్షులు కేంద్రంలో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, తెల్ల కంకణాయిలు, తెడ్డు ముక్కుకొంగలు, పలు రకాల బాతు జాతి పక్షులను పర్యాటకులు ఆసక్తిగా వీక్షించారు. ఫ్లెమింగోలను చూడాలంటే మాత్రం పులికాట్ సరస్సుకు రావాల్సిందే. శ్రీహరికోట–సూళ్లూరుపేట రోడ్డు, అటకానితిప్ప–పేర్నాడు, అటకానితిప్ప– వేనాడు రోడ్డు, తడ పడవల రేవు సమీపంలో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు గుమికూడి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
హుషార్.. బోటు షికార్
తడ మండలం భీములవారిపాళెం పడవల రేవు వద్ద బోట్ షికారుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. పులికాట్ సరస్సులో పడవలో ప్రయాణిస్తూ సంబరపడ్డారు.
ఉచితంగా బస్సులు
సూళ్లూరుపేటకు వచ్చిన పర్యాటకులకు నేలపట్టు, అటకానితిప్ప, భీములవారిపాళెం పడవల రేవు, శ్రీసిటీ పారిశ్రామికవాడకు ఉచితంగా బస్సులు నడిపారు.
షార్ కేంద్రానికి నో పర్మిషన్
ఫ్లెమింగో ఫెస్టివల్‌లో భాగంగా పర్యాటకుల షార్ సందర్శనకు అనుమతి లేకుండా పోయింది. సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ల్‌వీ సీ62 ప్రయోగించనున్న నేపథ్యంలో షార్ అధికారులు పర్మిషన్ మంజూరు చేయలేదు. అయితే సోమవారం నిర్వహించబోయే ప్రయోగాన్ని నేరుగా వీక్షించేందుకు మాత్రం అవకాశముంటుంది.
నేలపట్టులో మంచు విష్ణు సందడి
ప్రకృతి సంరక్షణలో కార్పొరేట్ భాగస్వామ్యం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఫ్లెమింగో ఫెస్టివల్‌లో భాగంగా ఆదివారం శ్రీసిటీలో ప్రకృతి సంరక్షణ, జీవ వైవిఽ ద్యం, సుస్థిర అభివృద్ధిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. కాఫీ విత్ కార్పొరేట్ పేరిట కార్పొరేట్ భాగస్వామ్యంపై చర్చింఆరు. తిరుపతి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి సి.సెల్వం అధ్యక్షత వహించగా, సిలికా డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ సీఈఓ అజిత్ కుమార్ పట్నాయక్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సతియా సెల్వం తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమల భాగస్వామ్యం, జీవ వైవిధ్య సంరక్షణ, పులికాట్ సరస్సు రక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కోలాహలంగా పక్షుల పండుగ
కోలాహలంగా పక్షుల పండుగ
కోలాహలంగా పక్షుల పండుగ


