‘పీఎస్‌ఎల్‌వీ’దే అగ్రస్థానం
ఇస్రో ప్రస్థానం..
సూళ్లూరుపేట : శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో తొలిసారిగా 1979 ఆగస్టు 10వ తేదీన 22 మీటర్లు పొడవు, 17 టన్నుల బరువుతో 40 కిలోల ఉపగ్రహంతో ఎస్‌ఎల్‌వీ–3 ఇ1 పేరుతో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తర్వాత ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాలు, ఏఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాలు ఘన ఇంధన దశలతోనే పూర్తి చేశారు. ఇందులో మిశ్రమ పలితాలు రావడంతో అందరి మదిలో పుట్టిందే పోలార్ సన్ సింక్రోనస్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ). ఈ రాకెట్‌ను ఘన, ద్రవ ఇంధనాలతో కలగలసిన రాకెట్‌గా రూపొందించాలని అప్పటి శాస్త్రవేత్తలు నంబి నారాయణన్, శ్రీనివాసన్ తదితరులు ఫ్రాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ద్రవ ఇంధన దశలను ఫ్రాన్స్‌కు పరిచయం చేసింది భారత శాస్త్రవేత్తలే కావడం గమనార్హం. భూమికి 505 నుంచి 730 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి బరువైన ఉపగ్రహాలు పంపేందుకు అధ్యయనం చేశారు. అప్పటి ఇస్రో చైర్మన్ యూఆర్‌రావు ఆధ్వర్యంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలకు సరైన వేదిక అవసరమని గుర్తించారు షార్‌లో ఒక వైపు మొదటి ప్రయోగ వేదిక (ఎంఎస్‌టీ)ని నిర్మిస్తూనే మరో వైపు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు అవసరమైన ద్రవ ఇంధన మోటార్ పరీక్షలను 1988లో ప్రారంభించారు. అప్పటి నుంచి 1992 దాకా అనేక పరీక్షలు నిర్వహించి పరిణితి సాధించారు. 44 మీటర్లు పొడవు 320 టన్నుల బరువుతో 1,400 కిలోల ఐఆర్‌ఎస్–1ఈ అనే ఉపగ్రహాన్ని 1993 సెప్టెంబర్ 20న మొట్టమొదటిగా పీఎస్‌ఎల్‌వీ–డీ1 పేరుతో ప్రయోగించారు. ద్రవ ఇంధన దశలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆ ప్రయోగం విఫలమైంది. తర్వాత 1994 అక్టోబర్ 15వ తేదీన పీఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల విజయంలో ద్రవ ఇంధన దశల్లో వినియోగించే వికాస్ ఇంజిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి దాకా చేసిన 63 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 60 ప్రయోగాలు విజయవంతమై 99.99 శాతం సక్సెస్ రేటును సాధించాయి. 60 పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 518 ఉపగ్రహాలను ప్రయోగించగా ఇందులో 38 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలే ఉండడం విశేషం. 72 స్వదేశీ ఉపగ్రహాలు, దేశీయంగా పలు యూనివర్సిటీలకు చెందిన 15 ఉపగ్రహాలను ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ (సమాచారం) ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూరపరిశీలనా ఉపగ్రహాలను), గ్రహాంతర ప్రయోగాలు, దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఘనత పీఎస్‌ఎల్‌వీకే దక్కింది. ఈ రాకెట్ రాకముందు ఇస్రో ఇతర దేశాల మీద ఆధారపడి ప్రయోగాలు చేసేది. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో భారత కీర్తి ప్రతిష్టలను పతాకస్థాయిలో నిలిపింది పీఎస్‌ఎల్‌వీనే. చంద్రయాన్–1, మార్స్ ఆర్బిటర్ మిషన్–1, ఆదిత్య ఎల్1, ఖగోళంలో పరిఽశోధనల నిమిత్తం ఆస్ట్రోశాట్ వంటి ముఖ్యమైన ప్రయోగాలు పీఎస్‌ఎల్‌వీతోనే సాధ్యమయ్యాయి. 2017లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారానే ఒకేసారి 104 ఉపగ్రహాలను తీసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది.


