ఇల్లు కూల్చివేతపై ఫిర్యాదు
తిరుపతి రూరల్ : ఇంటి కూల్చివేతపై బాధితులు ఆదివారం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివరాలు.. సాయినగర్ పంచాయతీకి చెందిన పి.జలజాక్షి తన కుటుంబంతో 2013 నుంచి ఓ ఇంట్లో నివసిస్తోంది. ఈ నెల 3వ తేదీన ఇదే కాలనీకి చెందిన కవిత, చిట్టి అలియాస్ పీసీ పాయల్ తమ అనుచరులతో కలిసి వచ్చి దౌర్జన్యం చేశారు. జేసీబీతో ఇంటిని కూల్చివేశారు. దీంతో తమ కుటుంబం రోడ్డున పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు పోలీసులు సైతం అండగా నిలబడ్డారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘానికి విన్నవించినట్లు వెల్లడించారు.
13న ముగ్గుల పోటీలు
తిరుపతి రూరల్: సంక్రాంతి పురస్కరించుకుని మండలంలోని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి తెలిపారు. మహిళలు ఈ పోటీల్లో విరివిగా పాల్గొనాలని ఆమె కోరారు.


