పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
చంద్రగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నారావారిపల్లె పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర, ఎస్పీ సుబ్బరాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎంచంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు రానున్న నేపథ్యంలో, పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వకూడదని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు భద్రత లైజన్ (ఏఎస్‌ఎల్)లో భాగంగా శనివారం నారావారిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్పీలు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన సాయంత్రం 5.20 గంటలకు రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుని, అనంతరం రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు వెళ్లి, అక్కడ బస చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు ప్రతి దశలో పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్యతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డీపీఓ సుశీల దేవి పాల్గొన్నారు.


