సీఆర్‌ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రేణిగుంట సీఆర్‌ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక ఎంపీ కార్యాలయంలో సీఆర్‌ఎస్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ గురుమూర్తి దృష్టికి తెచ్చారు. సీఆర్‌ఎస్ హాస్పిటల్‌లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. రిఫరల్ వైద్యం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని, పెద్ద చికిత్సలు అవసరమైన సందర్భాల్లో గుంతకల్లు డివిజన్ హాస్పిటల్‌కు వెళ్లాల్సి రావడంతో అత్యవసర పరిస్థితుల్లో సమయానుకూల వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. హెచ్‌ఆర్‌ఎ పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగులు కోరారు. గతంలోనే తిరుపతి పట్టణాన్ని టైర్–1 నగరంగా పరిగణించి హెచ్‌ఆర్‌ఎ పెంచాల్సిందిగా పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని ఎంపీ వారికి గుర్తు చేశారు. ఈ అంశంపై మరోసారి సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి, సీఆర్‌ఎస్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. త్వరలోనే సీఆర్‌ఎస్‌ను స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని ఉద్యోగులకు తెలిపారు.


