మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్
సూళ్లూరుపేట: ముందుగా నిర్ణయించిన మేరకు రెండు రోజులతోనే సరిపెట్టాలనుకున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సీఎం చంద్రబాబు ఈనెల 12న విచ్చేస్తున్న సందర్భంగా మూడు రోజులకు పండుగను పెంచామని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట పట్టణంలోని ఫ్లెమింగో ఫెస్టివల్ మైదానంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజల విజ్ఞప్తులు, సందర్శకులు స్పందనలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూచనలు, రాజకీయ కమిటీల సలహాల మేరకు పండుగను ఈ నెల 10, 11, 12 తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 12వ తేదీ సాయంత్రం 3.30 నుంచి 4.00 గంటల సీఎం చంద్రబాబు విచ్చేయనున్నారని, ఆయన నేలపట్టు లేదంటే అటకానితిప్ప ప్రాంతాల్లో ఫ్లెమింగో పాయింట్ సందర్శిస్తారని చెప్పారు. అనంతరం సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే పబ్లిక్ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్‌చారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, టూరిజం అధికారి ఆర్‌డీ రమణ ప్రసాద్, జనార్థన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, డీఎస్‌డీఓ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
బడి వైన్స్ దుకాణంలో చోరీ
తిరుపతి రూరల్: మండలంలోని చెర్లోపల్లిలో ఉన్న ‘బడి వైన్స్’లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు దుకాణం పైకప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ. 2,88,000 నగదును దోచుకెళ్లారు. వైన్స్ మేనేజర్ తులసి రామ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ ఎస్‌ఐ శ్రీరాములు ఘట నా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్


