పరోక్ష పన్నుల వ్యవస్థకు రీసెట్ జీఎస్టీ 2.0
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ’’జీఎస్టీ 2.0 భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థకు రీసెట్ లాంటిది. ఇది పన్ను రేట్ల సరళీకరణ, కఠినమైన నిబంధనలతో పాటు వివాదాలను వేగంగా పరిష్కరిస్తుంది. ఆడిటర్లకు ఇది కేవలం తనిఖీలకే కాకుండా సలహాదారుగా, రిస్క్ మేనేజ్‌మెంట్, డిజిటల్ అనుసరణలో కొత్త బాధ్యతలను కల్పిస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పి.ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సవరణలు, ఆడిటర్ల పాత్రపై అవగాహన పెంచేందుకు కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ), శ్రీసిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శ్రీసిటీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి రీజియన్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ నాగరాజ్ సభకు ఆనంద్ కుమార్‌ను పరిచయం చేశారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 2025 సె ప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 పీఎం నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 దృక్పథానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి అవగాహన సదస్సులు వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా బహుళజాతి యూనిట్లకు విధాన మార్పులను సులభంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో శ్రీసిటీకి చెందిన 100కుపైగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని జీఎస్టీ 2.0 అమలుపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


