‘యువజన పోరు’ విజయవంతం చేద్దాం
తిరుపతి కల్చరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి, యువజన సంఘాల పోరాటాలను అణచివేయడానికి అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతన్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం బైరాగిపట్టెడలోని సీపీఎం కార్యాలయంలో అన్ని విద్యార్థి సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యువతపై చేస్తున్న అక్రమదాడులు, కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టే యువజన పోరుకు వందలాదిగా విద్యార్థులు, యువత తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఆ ముగ్గురికే ఉద్యోగాలు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ముగ్గురికి మాత్రమే ఉద్యోగం వచ్చిందని హర్షిత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, విద్యాశాఖా మంత్రిగా నారా లోకేష్‌కు మాత్రమే ఉద్యోగావకాశం కలిగిందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోందని, వారందరికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అప్పుడు అడ్డుకుని ఇప్పుడు వదిలేశారు
గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేస్తుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి అడ్డుకున్న టీడీపీ పెద్దలు ప్రస్తుతం ఆ బకాయిలతో పాటు రెండేళ్లుగా కట్టాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు చెల్లించలేదని హర్షిత్‌రెడ్డి ప్రశ్నించారు.
నేడు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్థులపై పెడుతున్న అక్రమ కేసులను ఖండిద్దామని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఉదయ్‌వంశీ పిలుపునిచ్చారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అక్రమ కేసులపై ‘స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు’ అన్న నినాదాంతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు గురువారం ఆయన మీడియాకు తెలిపారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి సారధ్యంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.


