ఫిబ్రవరి 25 నాటికి ఈ–క్రాప్ పూర్తి చేయండి
తిరుపతి అర్బన్: జిల్లాలో ఫిబ్రవరి 25 తేదీ నాటికి వందశాతం ఈక్రాప్ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నా, రైతులకు పంట బీమా పొందాలన్నా తప్పకుండా ఈ క్రాప్ ఉండాలని స్పష్టం చేశారు. ఆ మేరకు అంతా పనిచేయాలని ఆదేశించారు.
రథసప్తమి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష
తిరుమల: జనవరి 25న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణతో కలిసి రథ సప్తమి రోజున భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ, తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర బృందాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమగ్ర బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
సైనికుల సంక్షేమానికి రూ.10లక్షల విరాళం
తిరుపతి అర్బన్: జిల్లా సైనికుల సంక్షేమానికి మెప్మా సంఘం సభ్యులు రూ.10లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్‌కు చెక్కు రూపంలో మెప్మా పీడీ ఎఫ్రాయిమ్, అధికారులు గాయిత్రి, సుమలత కలెక్టరేట్‌లో గురువారం అందజేశారు. జిల్లాలోని తిరుపతితోపాటు మరో ఆరు మున్సిపాలిటీల్లోని పొదుపు సంఘం సభ్యులు ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఇచ్చిన విరాళాన్ని అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.
ఫిబ్రవరి 25 నాటికి ఈ–క్రాప్ పూర్తి చేయండి


