సామాన్య భక్తులకు ప్రాధాన్యం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఆలయ పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి ఆయా విభాగాధిపతులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూల్లో ఉండే భక్తులకు ఉచితంగా తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలు దాతల నుంచి సేకరించనున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా లడ్డూ, వడ, పులిహోరా ప్రసాదాలను తయారు చేయడం, ఉచిత వైద్యకేంద్రాలను ఏర్పాటు, అన్నదానానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఖాళీ ప్రదేశాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు షామియానాలు, పందిళ్లు, కుర్చీలు ఏర్పాటు, తాత్కాలిక లైటింగ్, ఎస్‌ఈడీ స్క్రీన్లు, హోర్డింగ్లు ఏర్పాటుపై చర్చించామన్నారు. ఆలయంలో అవసరమైన ప్రదేశాల్లో పుష్పాలంకరణ, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, గత సంవత్సరం కన్నా అధికంగా తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపుగదులు ఏర్పాటు, స్వర్ణముఖి నది పరిసరాల్లో భక్తులు స్నానాలు చేసేందుకు షవర్ల ఏర్పాటుపై సమీక్షించినట్లు తెలిపారు. రథోత్సవం నిర్వహించేందుకు రథానికి తగిన మరమ్మతులు చేసి సిద్ధం చేయాలన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విధులకు వచ్చే పలుశాఖల వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గిరిప్రదక్షిణ సందర్భంగా భక్తులకు అవసరమైన భోజనం, అల్పాహారం, తాగునీరు తదితర వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు నాగరాజు, విజయమ్మ, ఆలయాధికారి కృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, రాజేష్ గురుకుల్, ఇన్‌చార్జి ఈఈ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


