ఐసర్‌లో టెన్నిస్ కోర్టు ప్రారంభం
ఏర్పేడు: తిరుపతి ఐసర్‌లో బుధవారం ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య చేతుల మీదుగా టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. ఐసర్ ప్రాంగణంలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కోసం టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేశారు. కోర్టును లాంఛనంగా ప్రారంభించిన ఆయన సిబ్బంది, విద్యార్థులతో కలసి సరదాగా కాసేపు టెన్నిస్ ఆడారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు, శారీరక ధారుఢ్యం సాధించేందుకు క్రీడల్లోనూ రాణించేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్‌సింగ్ కోహ్లీ, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనిలత్మజ ఆర్య సోమయాజులు పాల్గొన్నారు.
ఇరు వర్గాలపై కేసులు
రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచాయతీ తారకరామనగర్‌లో ఇద్దరు మహిళల మధ్య నగదు లావాదేవీ కారణంగా జరిగిన ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి సీతారామపురానికి చెందిన కస్తూరి నిర్మలకు తారకరామనగర్, సుందరయ్య కాలనీకి చెందిన పి.దీప మధ్య డబ్బుల లావాదేవీలకు సంబంధించి వివాదం ఏర్పడింది. ఈ వి షయంలో ఇరువర్గాల వారు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఈ నెల 4 వ తేదీన ఘర్షణ పడ్డారు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాల వారిని బుధవారం రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. రెండు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయని, దర్యాప్తు అనంతరం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇద్దరి అరెస్టు
రేణిగుంట: రేషన్ బియ్యం అక్రమ నిల్వ కేసులో పోలీసులు ఇద్దరి బుధవారం అరెస్టు చేశారు. గాజులమండ్యం పంచాయతీ నీలిసానిపేటలో మంగళవారం ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 7,310 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న దొడ్లమిట్టకు చెందిన శేఖర్, జీ పాళేనికి చెందిన మణిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


