పెత్తందారీ వ్యవస్థకు ఆరాటం
– సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
వరదయ్యపాళెం: ‘దళిత నియోజకవర్గమైన సత్యవేడులో కొందరు పెత్తందారులు చొరబడి పెత్తందారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ప్రశాంత నియోజకవర్గంలో చిచ్చు పెట్టడం సరికాదు.’ అని టీడీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యాఖానించారు. బుధవారం వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తాను అహర్నిశలు శ్రమించి పంచాయతీ భవనాలు, ఇతర రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసుకువస్తుంటే ఎలాంటి అధికారిక ప్రోటోకాల్ పదవి లేని వ్యక్తులు భూమిపూజ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి అనధికారిక చర్యలకు ప్రభుత్వాధికారులు వంత పాడుతూ, అనధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీనిపై తాను ఇప్పటికే అసెంబ్లీలో ఫ్రివైలెజేషన్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కచ్చితంగా నిబంధనలను అతిక్రమించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తానని హెచ్చరించారు. పెత్తందారీ వ్యవస్థకు బానిసై ఉద్యోగులు బలి కావొద్దని పేర్కొన్నారు. తాను ఎంతో ఓర్పుతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల్లో తిరుగుతుంటే అధికార పార్టీలోని కొందరు ఉద్దేశపూర్వకంగా తనను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నియోజకవర్గంలో పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నికై న ఎమ్మెల్యేను కాదని ప్రైవేటు వ్యక్తులకు ప్రోటోకాల్ పలకడం పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చ అన్నారు.


